న్యాయమూర్తి ఒక తీర్పును చెప్పేటప్పుడు ఆ కేసుకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించి, వాదోపవాదాలు విని సామాజిక దృక్పథంలో ఆలోచన చేస్తూ తీర్పు చెప్పి న్యాయ వ్యవస్థని సామాన్యులకు సరైన విధంగా అందేలా, సామాన్యులకి నమ్మకం కలిగించేలా చేయగల ఏకైక వ్యక్తి. ఎన్నో ఒత్తిడులు ఉన్నా సరే తన నియమానికి కట్టుబడి, న్యాయాన్ని కాపాడుతూ ఉంటాడు. కానీ అటువంటి న్యాయమూర్తిపైనే ఒత్తిడి తెచ్చి అనుకూలంగా తీర్పు చెప్పించుకుంటే ఆ వ్యవస్థ నిజాయితీ గల న్యాయమూర్తులు ఇమడగలరా..
ఇటువంటి సంఘటనే బ్యాంకాక్ లో జరిగింది. ఓ న్యాయమూర్తి తీర్పు చెప్పిన వెంటనే తాను నమ్ముకున్న సిద్దాంతానికి ద్రోహం చేశానని భావించి తనవద్ద ఉన్న తుపాకీ తో కాల్చుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివరాలలోకి వెళ్తే.
ఉగ్రవాదం వెర్రి తలలు వేసిన దక్షిణ ధాయ్ లో న్యాయవ్యవస్థని గుప్పెట్లో పెట్టుకుని మరీ నేరస్తులు చెలరేగి పోతున్నారు. ఈ క్రమంలోనే న్యాయమూర్తి కనకోర్న్ పియన్ ఒక హత్య కేసులో నిందితుల్ని నిర్దోషులుగా తీర్పు చెప్పిన తరువాత తుపాకీతో ఆత్మ హత్యా ప్రయత్నం చేశారు. ఈ తీర్పు చెప్పడానికి కొంత సమయం ముందుగానే ఆయన ఫేస్ బుక్ లైవ్ లో బ్రష్టు పట్టిన న్యాయవ్యవస్థ అంటూ సందేశం ఇచ్చారు. ఈ ఘోరం జరిగిన వెంటనే స్పందించిన కోర్టు సిబ్బంది ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతానికి ఆయన ప్రాణాలకి ఎటువంటి హాని లేదని వైద్యులు తెలిపారు.
ధాయ్ చరిత్రలో ఇలా ఒక న్యాయమూర్తి తన వ్యవస్థపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఇదే ప్రధమమని అంటున్నారు. ఈ ఒక్క ఆధారంగా ధాయ్ న్యాయ వ్యవస్థ ఎంతటి పాతాళానికి పడిపోయిందో తెలుస్తోందని స్థానిక మీడియా సైతం నిప్పులు చెరిగింది. దాంతో స్పందించిన న్యాయ శాఖ. సదరు న్యాయమూర్తి ఒత్తిడిలో ఉన్నారనేది నిజమే కానీ అది వ్యక్తిగత ఇబ్బందులే తప్ప మరేమీ లేదని వివరణ ఇచ్చింది.అయితే న్యాయమూర్తి కోలుకునే వరకూ అసలు విషయం బయటకి వచ్చే అవకాశమే లేదు అంటున్నారు పోలీసులు.