రాజకీయాల్లో తలలు పండిన నాయకులు సైతం ఒక్కొక్క సారి తడబాట్లు పడుతూనే ఉంటారు. ఇలాంటి వాటితో నాయకులు ఇబ్బంది కూడా ఎదుర్కొన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కూడా ఇలాంటిదేనని అంటున్నారు పరిశీలకులు. గత కొన్నాళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్న చంద్రబాబు.. అక్కడి రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేశారు. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు రాష్ట్రం సిద్ధమవుతున్న నేపథ్యంలో తనదైన శైలిలో ఇక్కడ విజృంభించాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అయితే.. రాజకీయపరంగా చూస్తే.. ఇది ఎంత మాత్రం తప్పుకాదు.
చంద్రబాబు నిర్ణయం ఆహ్వానించదగ్గదే. కానీ, వ్యూహాత్మకంగా చూస్తే.., మాత్రం హైదరాబాద్ రాజకీయాలపై చంద్రబాబు ఆలోచన తీవ్ర ప్రభావం చూపించడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. గ్రేటర్ పరిస్థితి రాజకీయంగా డోలాయమానంలో ఉంది. ఇక్కడ మరోసారి తిరిగి కార్పొరేషన్‌ను దక్కించుకునేందుకు అధికారటీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. అయితే, దీనికి అనేక ఎదురీతలు కనిపిస్తున్నాయి. రెండోసారి అధికారంలోకి వచ్చినా.. డ్రయినేజీ వ్యవస్థను బాగుచేయలేకపోవడం, ఇటీవల వచ్చిన తుఫానుతో హైదరాబాద్ చివురుటాకులా ఒణికిపోయినా.. అధికార పార్టీ చేతులు ఎత్తేయడం వంటి పరిణామాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.
మరీ ముఖ్యంగా సెటిలర్లు.. కేసీఆర్ సర్కారును తిప్పికొట్టాలని నిర్ణయించారు. దీనిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటే.. కార్పొరేషన్‌ను కైవసం చేసుకునే అవకాశం ఉంది. అయితే.. ప్రస్తుతం కాంగ్రెస్‌లో నాయకుల కొరత వెంటాడుతోంది. ఒకప్పుడు గ్రేటర్‌లో నాయకులు జోరుగా ఉన్నారు. ఇప్పుడు నాయకులు లేరు. అయినా.. సెటిలర్ల ఓటు తమకేనని కాంగ్రెస్ భావిస్తోంది. కానీ, ఇప్పుడు తమ పాత మిత్రుడు (2018లో కాంగ్రెస్‌తో కలిసి బాబు పోటీ చేశారు) టీడీపీ ఇక్కడ స్వయంగా పోటీ చేయాలని నిర్ణయించడం కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది.
నాయకత్వ లేమితో అల్లాడుతున్న కాంగ్రెస్‌కు ఓటు వేయాలని అనుకున్న వారు.. ఇప్పుడు బాబు ఎంట్రీతో టీడీపీవైపు మొగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. హైదరాబాద్ సెటిలర్లలో చంద్రబాబుపై ఇంకా అభిమానం ఉంది. రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో ఇది టీడీపీకి అనుకూలంగా మారితే.. ప్రత్యక్షంగా నష్టపోయేది.. కాంగ్రెస్ అంటున్నారు పరిశీలకులు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ కు పడవలసింది.. టీడీపీకి పడుతుంది. ఇది టీఆర్ ఎస్ కన్నా.. కాంగ్రెస్‌పైనే ప్రభావం చూపుతుందని.. కాంగ్రెస్.. కార్పోరేషన్‌ను దక్కించుకోవాలన్న ఆశలపై బాబు వ్యూహం గండికొట్టడంతోపాటు.. కేసీఆర్‌కు పరోక్షంగా లబ్ధిని చేకూర్చుతుందని.. అదేవిధంగా బీజేపీపైనా ప్రభావం చూపుతుందని అంటున్నారు.
అంతేకాకుండా గత ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అటు కాంగ్రెస్‌కు లేదా బీజేపీకి పడే అవకాశాలున్నప్పటికీ, బాబు ఎంట్రీతో ఫలితం వ్యతిరేకంగా వచ్చాయి. చంద్ర బాబు తో మహాకూటమి అని ఎప్పుడైతే ప్రకటించారో.. మళ్లీ ఆంధ్రా పెత్తనం అంటూ టీఆర్ఎస్ ప్రచారం చేసింది. మొత్తంగా బాబు వల్ల ప్రయోజనం లేకపోయినప్పటికీ నష్టం జరిగిందనేది అప్పటి మాట. కాంగ్రెస్, బీజేపీ అన్ని పార్టీల నాయకులు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కట్ చేస్తే గ్రేటర్ ఎన్నికలు వచ్చేశాయి.. బాబు మళ్లీ పోటీ చేస్తానంటూ రంగంలోకి దిగటానికి రెదీ అయిపోయారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఎలా చూసినా.. బాబు వ్యూహం.. కేసీఆర్‌కు మేలు చేస్తుందని అంటున్నారు.