వైశ్యుల‌తో ఆయ‌న‌.. బ్రాహ్మ‌ణులతో ఈయ‌న‌… వైసీపీ నేత‌ల కీచులాట‌లు…!

-

త‌మ సొంత సామాజిక వ‌ర్గాల‌ను బ‌లోపేతం చేసుకునేందుకు నాయ‌కులు ఎవ‌రైనా.. ఎక్క‌డైనా ప్ర‌య‌త్నాలు చేస్తారు. దీనికి సంబంధించి ముంద‌స్తు వ్యూహంతో ముందుకు సాగుతారు. రాజ‌కీయంగా ఎంత బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ.. పార్టీలో ఎంత ప‌లుకుబ‌డి ఉన్న‌ప్ప‌టికీ.. త‌మ త‌మ సామాజిక వ‌ర్గాల‌ను కాపాడుకునేందుకు నేతలు ముందు చూపుతో వ్య‌వ‌హ‌రిస్తారు. పార్టీల‌కు అతీతంగా ఇది సాగేదే. అయితే.. దీనికి భిన్నంగా వైసీపీకి చెందిన విజ‌య‌వాడ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఇద్ద‌రూ కూడా భిన్న‌మైన సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారే. ఒక‌రు మంత్రి కూడా. అయితే, వారి వారి సామాజిక వ‌ర్గాల్లో మాత్రం వీరు బ‌లోపేతం కాలేక పోతున్నారు. దీంతో వీరిపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వస్తున్నాయి.

విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే వెలంప‌ల్లి శ్రీనివాస్‌.. వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. సీఎం జ‌గ‌న్ త‌న కేబినెట్‌లో చోటు కూడా ఇచ్చారు. గుంటూరు, కృష్నా, ప్ర‌కాశం, నెల్లూరు త‌దిత‌ర ప్రధాన జిల్లాల్లో వైశ్య క‌మ్యూనిటీ ఎక్కువ‌గా ఉంది. రైస్ మిల్లింగ్ రంగం స‌హా స్పిన్నింగ్ వ్యాపారాలు.. ఎక్స్ పోర్టు, ఇంపోర్టు వంటి వ్యాపారాల‌ను వీరే చూస్తున్నారు. అయితే.. వీరికి స‌మ‌స్య‌లు కూడా ఎక్కువే. దీంతో ఎప్పుడు ఏ ప్ర‌భుత్వంలో అయినా.. త‌మ వ‌ర్గానికి ప్రాధాన్యం ఇవ్వాల‌నే డిమాండ్లు వినిపిస్తూ ఉంటాయి.

గ‌తంలో మంత్రిగా చేసిన శిద్దా రాఘ‌రావు వీరికి అన్ని విధాలా స‌హ‌క‌రించారు. అప్ప‌ట్లో మంత్రి విష‌యంలో ఎలాంటి వివాదాలూ రాలేదు. కానీ, వెలంప‌ల్లి విష‌యంలో మాత్రం ఈ నాలుగు జిల్లాల వైశ్యులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మా కులానికి చెందిన నాయ‌కుడు క‌న్నా.. వేరే వారే బెట‌ర్‌! అనే టాక్ వినిపిస్తోంది. వీరిని ప‌ట్టించుకోవ‌డం లేదు. స‌మ‌స్య‌లు వినిపించుకోవ‌డ‌మూ లేదు. కేవ‌లం త‌న సొంత ఇమేజ్‌ను పెంచుకునేందుకు.. జ‌గ‌న్‌పై పొగ‌డ్త‌ల  వ‌ర్షం కురిపించేందుకు మాత్ర‌మే వెలంప‌ల్లి ప‌రిమిత‌మ‌వుతున్నార‌నేది వీరి వాద‌న‌. ఏ విష‌యంచెప్పినా.. ఇది ఎప్పుడూ ఉండేదేలే.. అంటూ లైట్ తీసుకోవ‌డం సాధార‌ణంగా మారింద‌ని అంటున్నారు.

దీంతో ఆయ‌న‌కు ఈ వ‌ర్గంలో ప‌ట్టు త‌ప్పుతోంద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక‌, మ‌రో ఎమ్మెల్యే బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ చైర్మ‌న్ కూడా అయిన మ‌ల్లాది విష్ణుది మ‌రో ర‌గ‌డ‌. స‌త్య‌నారాయ‌ణ పురం, భ‌వానీ పురం (నియోజ‌క‌వ‌ర్గంతో సంబంధం లేదు), దేవీ న‌గ‌ర్ వంటి ప‌లు సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప్రాంతాల్లో బ్రాహ్మ‌ణుల ఆధిప‌త్యం ఎక్కువ‌. దీంతో ఆయ‌న‌పై వీరు చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ,  స‌మ‌స్య చెప్పుకొందామ‌న్నా అప్పాయింట్మెంట్ ఉండ‌దు. ఎంత‌సేపూ.. సార్ వేరే ప‌నిలో ఉన్నారు రేపు రండి.. అంటూ సెక్ర‌ట‌రీలు తిప్పిపంపుతున్నారు. ఇక‌, కార్పొరేష‌న్ త‌ర‌ఫున రుణాల మంజూరు విష‌యం కూడా వివాదాల‌కు కేంద్రంగా మారింది.

దీంతో వీరు కూడా విష్ణుపై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన వీరే త‌మ‌ను ప‌ట్టించుకోక పోతే.. ఎవ‌రు త‌మ క‌ష్టాలు తీరుస్తారు? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం లేకుండా పోయింది. ఈ గ్యాప్‌ను భ‌ర్తీ చేసేందుకు టీడీపీ నాయ‌కులు ఇప్ప‌టికే రెడీ అయ్యారు. జ‌గ్గ‌య్య‌పేట మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాత‌య్య‌, సెంట్ర‌ల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాలు.. ప్ర‌త్యేకంగా వీరికి ఫోన్ చేసి.. రండి మ‌నం మ‌నం మాట్లాడుకుందాం.. అనే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇదిమున్ముందు వీరికి ఇబ్బందేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version