తెలంగాణలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన హరిత హోటళ్లు మూతపడటానికి గత బీఆర్ఎస్ సర్కారే కారణమని ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్, టూరిజం, కల్చర్, ఆర్కియాలజీ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. బుధవారం హుస్సేన్ సాగర్‌లో అడ్వెంచర్ వాటర్ క్రీడలను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ..కేరళ తరహాలో రానున్న రోజుల్లో తెలంగాణ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
నదీ జలాలను సైతం పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. హుస్సేన్ సాగర్‌లోని జలాలు పూర్తిగా కలుషితం అయ్యాయని..వాటిని శుద్ధి చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. తెలంగాణ టూరిజంను గత బీఆర్ఎస్ ప్రభత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, రాష్ట్ర వ్యాప్తంగా గతంలో నడిచిన 30 హరిత హోటళ్లు పూర్తిగా మూతపడ్డాయని తెలిపారు.ప్రభుత్వ వనరులను ప్రైవేటు వాళ్లకు లీజుకు ఇచ్చి మరల వాటికి పునర్వైభవం తీసుకొస్తామని మంత్రి జూపల్లి స్పష్టంచేశారు.