చైనాలో భాగంగా అక్సాయ్-చిన్ను చూపించిన మ్యాప్ పై భారత్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ సైట్ నుండి ఈ మ్యాప్ ని తొలగించాలని భారత ప్రభుత్వం ఆన్ లైన్ ఎన్ సైక్లోపీడియా వికీపీడియాను బుధవారం కోరింది. ఐటి చట్టం సెక్షన్ 69 ఎ (డిజిటల్ సమాచారానికి ప్రజల ప్రాప్యతను నిరోధించడం) కింద ఉన్న లింక్ ను తొలగించాలని ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి మంత్రిత్వ శాఖ వికీపీడియాకు ఆదేశించింది.
భారత్-భూటాన్ సంబంధానికి సంబంధించిన వికీపీడియా పేజీ జమ్మూ కాశ్మీర్ మ్యాప్‌ను తప్పుగా చిత్రీకరించిందని, చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఒక సోషల్ మీడియా యూజర్ కోరారు. దీనితో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రిత్వ శాఖ భారతదేశం యొక్క ప్రాదేశిక సమగ్రతను మరియు సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినందున సదరు మ్యాప్ ను తొలగించాలని వికీపీడియాకు ఆదేశాలు పంపింది. ఆదేశాలు అమలు చేయకపోతే భారత్ లో సదరు సైట్ ని నిలిపివేయవచ్చు.