50 ఏళ్ల క్రితం రామ్ రామ్ పచ్చ బొట్టును నా శరీరం మీద వేసుకున్నా. ఇప్పటికీ అది అలాగే ఉంది. నేను ఎప్పుడైతే నా శరీరం మీద టాటూలు వేసుకున్నానో.. అప్పటి నుంచి నాకిది రెండో జన్మ. మొదటి జన్మలో నేను చనిపోయా..
మీరు ఎప్పుడైనా చత్తీస్ గఢ్ వెళ్లారా? వెళ్తే అక్కడ ఉండే రామ్ నామీస్ ను చూశారా? రామ్ నామీస్ అంటే రామ్ నామీ సమాజ్ మత ఉద్యమం ఫాలోవర్స్ వాళ్లు. వాళ్లది చాలా విచిత్రమైన పరిస్థితి. ఎలా అంటే.. వాళ్లది హిందువులలోనే తక్కువ జాతి. అందుకే వాళ్లు గుళ్లలోకి వెళ్లడానికి అర్హులు కాదు. ఇది ఇప్పటి ఆచారం కాదు.. వందల ఏళ్ల క్రితం ఉన్న ఆచారం. అందుకే.. వందల ఏళ్ల క్రితమే వాళ్లు దేవుడినే తమలో ఐక్యం చేసుకున్నారు. దేవుడు కులానికి, మతానికి సంబంధించిన వాడు కాదు.. దేవుడు అనేవాడు ఎక్కడైనా ఉంటారు. చివరకు మా శరీరంలోని అణువణువునా ఉంటాడు అని చాటి చెప్పడానికి తమ ఒంటి మీద మొత్తం రామ్ రామ్ టాటూలను వేయించుకున్నారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ఆచారం కొనసాగుతూనే ఉంది. ఆ తెగ ప్రజలు ఎవ్వరిని చూసినా వాళ్ల శరీరమంతా రామ్ రామ్ పచ్చ బొట్లతో నిండి ఉంటుంది. ఈ తెగ ప్రజలు ఛత్తీస్ గఢ్ లోని జంగాహాన్, దాని చుట్టుపక్కన ప్రాంతాల్లో నివసిస్తారు.
జంగాహాన్ లో నివసించే 76 ఏళ్ల మహెట్టర్ రామ్ టండన్ ఏమంటాడంటే… 50 ఏళ్ల క్రితం రామ్ రామ్ పచ్చ బొట్టును నా శరీరం మీద వేసుకున్నా. ఇప్పటికీ అది అలాగే ఉంది. నేను ఎప్పుడైతే నా శరీరం మీద టాటూలు వేసుకున్నానో.. అప్పటి నుంచి నాకిది రెండో జన్మ. మొదటి జన్మలో నేను చనిపోయా.. అన్నాడు.
ఛత్తీస్ గఢ్ లోని చాలా గ్రామాల్లో రామ్ నామీస్ ఉన్నారు. వాళ్లంతా లక్షకు పైనే ఉంటారు. 1955 కు ముందు వాళ్ల జీవితం మరీ దుర్భరంగా ఉండేది. వాళ్లు చాలా హింసకు గురయ్యేవారు. వాళ్లు తక్కువ కులం వాళ్లు అయినందున వాళ్లను ఎక్కడా అనుమతించేవారు కాదు. చివరకు చదువు కూడా వాళ్లకు అందని ద్రాక్షే. అంతకుముందు నుంచే వాళ్ల పూర్వీకుల కాలం నుంచి పచ్చ బొట్టు సంస్కృతిని కొనసాగిస్తున్నారు.
పాత కాలం మనుషులైతే తమ శరీరమంతా టాటూలు వేసుకోవడానికి ఇష్టపడ్డారు కానీ.. నేటి యూత్ టాటూలు వేసుకోవద్దని సలహాలు ఇస్తుందని రామ్ నామీస్ చెబుతున్నారు. అలా అని వాళ్లకు రామ్ నామీస్ మీద నమ్మకం లేదని కాదు.. కాకపోతే వాళ్లు చదువుకున్న వాళ్లు, పట్టణాల్లో ఉద్యోగాలు చేసేవాళ్లు.. ఒళ్లంతా ఇలా టాటూలు వేసుకోవడం కరెక్ట్ కాదనేది వాళ్ల అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చాడు రామ్ టండన్.
వీళ్లు ఒళ్లంతా పచ్చ బొట్లు పొడిపించుకోవడానికి దాదాపుగా 4 నుంచి 5 నెలలు కష్టపడతారట. గోర్బా అనే గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు వయసు 75 పేరు బాయ్.. ఏమంటుందంటే… నా శరీరానికి రామ్ రామ్ పచ్చబొట్టు వేసుకోవడానికి దాదాపు 18 వారాల సమయం పట్టింది. కిరోసిన్ దీపం నుంచి వచ్చే మసికి నీళ్లు కలిపి పచ్చ బొట్టు వేసుకునే వాళ్లం. దేవుడు ఒక కులానికి, మతానికి చెందిన వాడు కాదు.. దేవుడు అందరికీ చెందినవాడు.. అంటూ చెప్పుకొచ్చింది.
ఈతరంలో పుట్టే పిల్లలకు కూడా టాటూ వేస్తారు. కాకపోతే ముందుగా చాతి భాగంలో టాటూ వేస్తారట. రామ్ నామీలు మందు, పొగ తాగరు. ఎటువంటి చెడు అలవాట్లు ఉండవు. వాళ్లు రోజూ రామనామాన్ని జపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి ఇంట్లో రామాయణం పుస్తకం ఉంటుంది. అలాగే దేవుడి ఫోటోలను, విగ్రహాలను ఇంట్లో పెట్టుకొని పూజిస్తారు. వాళ్ల ఇంటి ముందు కూడా రామ్ రామ్ అని నల్లటి ఇంకుతో రాస్తారు.