ఒక సినిమా గాయాలను గుర్తు చేస్తోంది
కన్నీటి తీరాలకు చేరుస్తోంది
గాయాలు దాటి వచ్చాక మనుషులు ఏమయిపోతున్నారు
మతాలుగా విడిపోవడం సులువు మనుషులుగా కలిసి ఉండడమే కష్టం
ఆ కష్టం క్షణ కాలం ఉంటే మేలు..అంతకు మించిన సాగదీత జీవితంలో వద్దే వద్దు. ఓ మామూలు డాక్యుమెంటరీ సినిమా దేశ వ్యాప్తంగా మూడు వందల కోట్ల రూపాయలను వసూలు చేస్తోంది. ఆ ఉద్వేగాల జడి కొన్ని వివాదాలకు తావివ్వచ్చు. ఏ కొందరికో నచ్చక పోవచ్చు. విభేదంను స్వాగతిస్తూ..వివాదాలకు ముగింపు ఇస్తూ.. సాగిద్దాం ఓ అర్థవంతం అయిన చర్చ. సీనియర్ జర్నలిస్ట్ తోట ప్రసాద్ అందిస్తోన్న విశ్లేషణకు సంగ్రహ రూపం ఇది. చదవండిక.
ద కశ్మీర్ ఫైల్స్. ఒక డాక్యుమెంటరీ తరహా సినిమా. ఈ తరహా సినిమా ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పుడొక సంచలనం. ఇందుకు మొదటి కారణం ఈ తరహా సినిమా భారీ స్టార్ క్యాస్ట్ ఉన్న సినిమాలతో సమానంగా అనూహ్య రీతిలో రూ.300 కోట్లను వసూలు చేయడం. రెండో కారణం ఇందులో చర్చించిన, చూపించిన రెండు వర్గాలకు ఇది ఇష్టం లేని, ఇష్టపడని నిజం కావడం. ఒక వర్గానికి ఇది మరిచిపోలేని శాపం అయితే మరో వర్గానికి ఇది గుర్తు చేసుకునేందుకు ఇష్టపడని క్రౌర్యం. ..కొండంత కష్టం. తన గడ్డను వదిలి మరో చోటుకు పొమ్మంటూ తరిమి తరిమి కొడితే..సొంత దేశంలోనే శరణార్థులుగా బతకాల్సిన దైన్యం..పచ్చాపచ్చని మోసులు చక్కగా ఎదగాల్సిన చోట పచ్చినెత్తురు పారిన రక్త చరిత్రను కళ్లకు కట్టిన వైనం…వెరసి ద కశ్మీర్‌ఫైల్స్. రచయిత, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన ద కశ్మీర్ ఫైల్స్.
ఇంత చర్చ ఎందుకు?
ఈ సినిమా గురించి ఇప్పుడు ఎందుకు ఇక్కడ ప్రస్తావించాల్సి వస్తోంది ? ఎందుకు ఇది విపరీతమైన చర్చలకు, వివాదాలకు తావిస్తోంది. అసలు ఇలాంటి వివాదాస్పద సినిమాలు ఎందుకు వస్తున్నాయి? వాటికి జనాదరణ ఉంటోందా? అవి చరిత్రను సరిగ్గానే బేరీజు వేస్తున్నాయా? ఒకసారి పరిశీలిద్దాం. చరిత్ర మనం సృష్టించలేం. రాసింది మార్చేందుకు వీలూ లేదు. ఏం జరిగిందో అదే చరిత్ర. చరిత్ర దానికదే సాక్షి. దాన్ని ఎవ్వరూ వక్రీకరించలేరు. అలాంటి ప్రయత్నం జరిగినా పరీక్షకు నిలబడదు. సాధారణంగా విజేతలు చెప్పిందే నిజంగా చెలామణీ అవుతుంది..అని అంటుంటారు. చరిత్ర కానీ ఇతిహాసాలు కానీ వాటిలో నిజానిజాలు ఏంటనేవి ఎప్పుడూ ప్రశ్నార్థకమే ! ఈ సమాజంంలో ఆధిపత్య పోరు అనేది ఎప్పుడూ ఉంది. వాటికి కొన్నిసార్లు వర్గ వైషమ్యాలు కారణమైతే మరికొన్ని సార్లు అధికార వాంఛ మరో కారణం. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో మనోభావాలు దెబ్బతినడం అనే కారణాన్ని కూడా ఇందులో చేర్చుకోవాలి మనం. కశ్మీర్‌ఫైల్స్ గురించి ఇందుకే చర్చించాల్సివస్తోంది. ఈ సినిమా ఒక వర్గం మనోభావాల్ని కించపరిచేలా ఉందని వివాదం చెలరేగింది.
సహానుభూతి చెందడమే అసలు లక్ష్యం
రెండో ప్రపంచయుద్ధం సందర్భంలో నాజీలు యూదులను చిత్రహింసలు పెట్టారు. దారుణ దమనకాండకు పాల్పడ్డారు.ఈ అంశాలతో ఎన్నో హాలీవుడ్ సినిమాలు తెరకెక్కాయి. వాటిలో ఎక్కడా కల్పితాలు లేవు, నాటకీకరణ లేదు. చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా తెరకెక్కించారు. వర్ణ వివక్షపై హాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. ఇవి మనసును కలచి వేస్తాయి.ఈ సినిమాలన్నింటిలో ఎప్పుడో జరిగిన ఒక దారుణాన్ని లేదా అనుభవించిన వివక్షను లేదా వేధింపులను ఇప్పుడు చూపించాల్సిన అవసరం ఏముంది? దాని వల్ల ఇప్పుడు సమాజానికి తెలియజెప్పాల్సిన కొత్త విషయాలు ఏముంటాయి? వాటివల్ల ఆయా వర్గాలు, జాతుల మధ్య సామరస్యం దెబ్బతింటుందా? ఆయా వేధింపులను, వివక్షను, వైషమ్యాలను తిరగదోడేందుకు ఇవి పరోక్ష కారణమవుతాయా? అన్న ప్రశ్నలు ఎదురయితే అన్నింటికీ ఒకే సమాధానం కాదు అని చిత్ర వర్గాల నుంచి వినిపిస్తోంది. మిగతా సృజన సంబంధ వ్యక్తుల నుంచి కూడా వినిపించవచ్చు.
ఓహో ! ఒకప్పుడు ఇలా జరిగిందా? వారి స్థానంలో మనం ఉంటే ఏం చేస్తాం? అసలు అలా చేయాల్సినం అవసరం ఏముంది? అందరం ఒకటిగా ఉండలేమా? అందర్నీ ఒకే విధంగా చూడలేమా? అన్న ప్రశ్నలు రేకెత్తించడం. మనలోని సహృదయతను, సున్నితత్వాన్ని తట్టిలేపడం..అన్నవి ఈ తరహా చిత్రాల ప్రధాన అవసరాలు..లక్ష్యాలు కూడా ! మనసున్న మనషులు ఎదుటి వారి బాధను తమదిగా భావిస్తారు. మానవత్వం ఉన్న మనుషులు ఎప్పుడూ బాధితుల పక్షానే ఉంటారు. అప్పుడు వారికి ఈ విధంగా జరిగింది కదా! ఆ విధంగా వేరొకరెవ్వరికీ జరగకూడదని అనుకుంటారు. తీవ్ర సంకుచిత మనస్తత్వం, భావోద్వేగాలు ఉన్న వారు మాత్రమే ఇతరులకు విరుద్ధంగా ప్రవర్తిస్తారు. వ్యవహరిస్తారు.
దేశవిభజన, వర్గ వైషమ్యాలపై భారతీయ సినిమా
ఇక భారతీయ చరిత్ర విషయానికొస్తే ఇక్కడా అలాంటి వైషమ్యాలు, చీకటి రోజులు ఉన్నాయి. బ్రిటీషు పాలనలో దేశ ప్రజలపై జరిగిన దాడులు, దేశ విభజన సమయంలో జరిగిన సంఘటనలు తీవ్రంగా కలిచివేస్తాయి. ప్రముఖ జర్నలిస్టు, రచయిత కుష్వంత్‌సింగ్ రాసిన ‘‘ ఎ ట్రెయిన్ టు పాకిస్తాన్’’ నవల ఆధారంగా 1998లో వచ్చిన హిందీ సినిమాను పరిశీలిస్తే ఎన్నో హృదయ విదారక విషయాలు అర్థమవుతాయి.
దేశవిభజన నేపథ్యంలో ఎన్నో నవలలు సినిమాలు వచ్చాయి. వాటిని నిషేధించాలనే ప్రయత్నాలు, ఆ చిత్ర బృందాలపై, వాటి ప్రదర్శన కేంద్రాలపై దాడులు జరిగాయి. 1975లో ఎం.ఎస్.సచ్చు అనే దర్శకుడు గరమ్‌హవా ఇందుకు మంచి ఉదాహరణ. దేశ విభజన నేపథ్యంలో తీసిన ఈ సినిమా దేశ వ్యతిరేకంగా ఉందని చాలామంది ప్రముఖ రాజకీయనాయకులు భావించారు.ఆ సినిమా ఎన్నో ఏళ్ల పాటు సెన్సార్‌కు నోచుకోలేదు. చివరకు ఎన్నో ఆటంకాల తర్వాత ఆ సినిమా రిలీజైంది. జనాదరణకు నోచుకుంది. కిస్సా కుర్సీ కా సినిమా కూడా ఈ కోవలోనిదే. కారణం భిన్నం. ఇదే కోవలో చాలా సినిమాలున్నాయి. బొంబాయి సినిమా ఎలాంటి వివాదాలకు లోనైందో? ఎంత సంచలనాన్ని సృష్టించిందో మనకు తెలుసు.
సంయమనం అవసరం…
సమాజంలో ఎలాంటి సంఘటనలు, దారుణాలు జరిగినా ప్రజలందరూ దానికి ఏదో విధంగా బాధితులు అవుతారు. వాటికి జాతి, కులం, మతం ఇలా..ఎలాంటి తేడా ఉండదు. బాధితులు రెండు వర్గాల్లోనూ ఉంటారు. ఎవరివైపునుంచి కథ చెబుతున్నాం ?ఎలాంటి కథ చెబుతున్నాం ? అనేది ముఖ్యాంశం. బాధితుల ఆక్రందనను చూపించడంలో, చెప్పడంలో ఎలాంటి తప్పూ లేదు. కానీ తప్పుదోవ పట్టించకూడదు. సంయమనం పాటించాలి..దర్శక రచయితలు. మనం మనుషులం. సంఘటనను సంఘటనగానే చూద్దాం. చరిత్రను చరిత్రగానే చూద్దాం. మనం అభిప్రాయాలతో దేనికీ రంగులు ఆపాదించకూడదు.
ఇటువంటి వివాదాస్పద సినిమాలు వచ్చినప్పుడు ఆ సినిమా సెన్సార్‌బోర్డులో ఆ కథాంశం గురించి తెలిసినవారు,అవగాహన ఉన్న వారు, చరిత్ర గురించిన లోతైన అధ్యయనం చేసిన పరిశోధకులు, రచయితలు లేదా జర్నలిస్టులు, ఇతరు మీడియా ప్రముఖులను గౌరవసభ్యులుగా చేరిస్తే సునిశితంగా పరిశీలించి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ఇక చివరిగా సినిమా సినిమాలానే చూడాలి. చరిత్రను చరిత్రలానే తెలుసుకోవాలి. వాటి తాలూకా హ్యాంగోవర్లను మనం మోయకూడదు. ఎవరికీ ఆపాదించకూడదు. ఇదే సరైన విధానం. ఇదే ఇదే సక్రమమైన విధానం.
సోర్స్ : సీనియర్ జర్నలిస్ట్ తోట ప్రసాద్