ఇటీవల వరుసగా విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్న కజకిస్థాన్, సౌత్ కొరియాలో ప్యాసింజర్ విమానం క్రాష్ అయిన విషయం తెలిసిందే. ఆ భయానక ఘటనలు మరువక ముందే మరో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. తాజాగా అమెరికాలోని సౌత్ కాలిఫోర్నియా పరిధిలోని ఆరెంజ్ కౌంటీ నగరం ఫుల్లెర్టన్‌లో టేకాఫ్ అవుతున్న సమయంలో విమానం ఉన్నట్టుండి కుప్పకూలింది.
గురువారం మధ్యాహ్నం 2.09 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 18 మందికి పైగా గాయాలయ్యాయి.విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది,పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, దీనిపై ఎయిర్ పోర్టు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.