2006 లో జరిగిన పాకిస్తాన్ తో టెస్ట్ మ్యాచ్ లో తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ వికెట్లు తీసిన టీం ఇండియా సీనియర్ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. గత కొంత కాలంగా భారత జట్టుకి దూరంగా ఉన్న పఠాన్, అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. స్వింగ్ బౌలింగ్ తో ఆకట్టుకున్న పఠాన్, గంగూలి కెప్టెన్సీలో అంతర్జాతీయ క్రికెట్ కి అడుగుపెట్టాడు. 2003 లో తొలిసారి భారత జట్టుకి ఆడాడు.
29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20లు ఆడి మొత్తం 301 అంతర్జాతీయ వికెట్లు తీశాడు. మొత్తం 29 టెస్టు మ్యాచుల్లో పఠాన్ మొత్తం 1105 పరుగులు చేశాడు. ఇక 120 వన్డేలలో 1544 పరుగులు చేశాడు. 24 టీ20 లు ఆడగా 172 పరుగులు చేశాడు. 2006లో పాకిస్థాన్ పై టెస్ మ్యాచులో తొలి ఓవర్లో హ్యాట్రిక్ తీసిన ఇర్ఫాన్ పఠాన్ పేరు అప్పట్లో మారుమోగిపోయింది. టీం ఇండియా కీలక బౌలర్ అవుతాడు అనుకున్న సమయంలో,
కెప్టెన్ గా అడుగు పెట్టిన ధోని నిర్ణయాలతో పఠాన్ కెరీర్ ఒక్కసారిగా కుదుపులకు గురైంది. బౌలర్ గా రాణిస్తున్న తరుణంలో అతన్ని ఓపెనర్ నుంచి 10 స్థానం వరకు అన్ని స్థానాల్లో బ్యాటింగ్ చేయించడంతో అతని కెరీర్ ఒక్కసారిగా కుదుపులకు గురైంది. అటు బౌలింగ్ కూడా లయ తప్పింది. 2007 టీ20 ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై 16 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. పాకిస్తాన్ జట్టుకి ఎన్నో మ్యాచుల్లో అతను నిద్ర లేకుండా చేసాడు.