ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలో సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. ఇప్పటికే పాలనలో తన మార్క్ చూపిస్తున్న జగన్ ఇప్పుడు సరికొత్త నిర్ణయాలను అమలు చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. పాలనలో పారదర్శకత అంటూ ముందు నుంచి చెప్తున్న జగన్ రాజకీయంగా, కుటుంబ పరంగా కూడా ఎన్ని వత్తిళ్ళు వచ్చినా సరే వెనక్కు తగ్గోద్దనే ఆలోచనలో ఉన్నారు. కింది స్థాయి నుంచి మార్పులను మొదలుపెట్టాలని భావిస్తున్నారు.
ఒక ప్రత్యేక టీం ద్వారా అవినీతి అధికారుల జాబితాను జగన్ సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రతీ శాఖలోనూ కీలక అధికారుల చరిత్ర ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని శాఖల్లో తిష్ట వేసిన అధికారుల జాబితాను జగన్ సేకరించమని చెప్పారట. అలాగే ప్రజలకు అందుబాటులో లేకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించే అధికారుల మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. వారి మీద నిఘా పెట్టి వెంటనే సస్పెండ్ చెయ్యాలని కూడా కొన్ని శాఖలకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది.
అదే విధంగా కొన్ని శాఖల అధిపతులను కూడా మార్చేసే అవకాశం ఉందని సమాచారం. కొన్ని మీడియా సంస్థలకు సమాచారాన్ని ఇస్తున్నారనే అనుమానంతో శాఖల్లోని అధికారుల మీద నిఘా పెట్టి వారిని అవసరమైతే సస్పెండ్ చెయ్యాలని భావిస్తున్నారట. జూలై లోపు వారి జాబితాను సిద్దం చెయ్యాలని జగన్ చెప్పినట్టు సమాచార౦. ఇక రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తూ, విపక్షాలకు సహకరిస్తే కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. ఆ జాబితా వస్తే బహిరంగంగానే వారిని తప్పించే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.