హైదరాబాద్ మహానగరంలో భూ కబ్జా దారులు తెగ రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అస్సలు వదలడం లేదు. వెంటనే సైన్ బోర్డులు పెట్టేస్తున్నారు. అంతేకాకుండా వాటికి దొంగ కాగితాలు క్రియేట్ చేసి అమ్మేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలో గ్రేటర్ పరిధిలో చాలా చోటుచేసుకుంటున్నాయి. అక్రమార్కుల దాటికి సామాన్యులు నానా అవస్థలు పడుతున్నారు.
తాజాగా ఇలాంటి ఘటన ఒకటి నగరంలో వెలుగుచూసింది. సామాన్యుల స్థలాలే కాకుండా ఏకంగా ప్రభుత్వ భూమికే కొందరు ఎసరుపెట్టారు. నగరం నడిబొడ్డున గల చార్మినార్ పోలీస్‌స్టేషన్ నిర్మాణం కోసం కేటాయించిన 700 గజాల స్థలం తాజాగా కబ్జాకు గురైంది. అందులో ఏకంగా నిర్మాణాలు కూడా ప్రారంభించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆ పనులు నిలిపివేయాలని హెచ్చరించారు. అయినప్పటికీ వారు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్థలం కబ్జా చేసిన ఐదుగురిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.