తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం భక్తులకు పరమపవిత్రం. ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో ప్రధానమైనది.అన్ని లడ్డులలో తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముక్యత దేనికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే దీని రుచి, సువాసన ప్రపంచంలో ఏ లడ్డుకు ఉండదు. భక్తులు భక్తిశ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డూదే తొలిస్థానం. తిరుమల ఆలయంలో ప్రసాదంలో 15వ శతాబ్ది నుంచి 20వ శతాబ్ది తొలినాళ్ళ వరకూ ఇప్పుడు లడ్డూకి ఉన్న స్థానం వడకు ఉండేది.
ఈస్టిండియా కంపెనీ ఆధ్వర్యంలో మహంతులు తిరుమల ఆలయ నిర్వహణ చూసే రోజుల్లో 19వ శతాబ్ది మధ్యభాగంలో తీపిబూందీ ప్రవేశపెట్టారు. 1940ల నాటికి అదే లడ్డూగా మారింది. క్రమేపీ వడ స్థానాన్ని లడ్డు సంపాదించుకుంది, ఇప్పుడు లడ్డుకు డిమాండ్ ఎంతో ఉంది. ఈ లడ్డూ 1940లో పరిచయమై 2018 నాటికి 78 ఏళ్లు పూర్తిచేసుకుంది. అలాగే రోజుకు మూడు లక్షలకు పైగా లడ్డూలు తయారు చేయగల సామర్థ్యం టీటీడీ సొంతం.
బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు మరింత ఎక్కువగా లడ్డూలను అందుబాటులో ఉంచుతారు టీటీడీ అధికారులు. అంతేకాదు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ కార్యాలయం రిజిస్ట్రార్ 2014వ సంవత్సరంలో `జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్` కూడా టిటిడి అధికారులకు అందజేశారు. అలాగే ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు, అతిథుల కోసం 750 గ్రాముల ఆస్థానం లడ్డూ, కల్యాణోత్సవం లడ్డూ, భక్తులకు ఇచ్చే 175 గ్రాముల సాధారణ ప్రోక్తం లడ్డూ తయారు చేస్తున్నారు.
ప్రసాదాల తయారీకి రూ.200 కోట్ల ఖర్చు తిరుమలేశుని లడ్డూ, ప్రసాదాల తయారీకి అవసరమైన 16 వేల మెట్రిక్ టన్నుల ముడి పదార్థాల కొనుగోలు కోసం టీటీడీ ఏటా రూ.200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తోంది.