భారతీయ స్రీలు తెల్లవారుజామునే లేచి ఇంటి ముందు కళ్లకు ఇంపుగా, పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చే రంగుల ముగ్గులు వేయడం మన సంప్రదాయంలో ఒక భాగం గా భావివిస్తారు. కేవలం అలంకరణ కోసమేనా ఈ ముగ్గులు? అసలు ముగ్గు వేయడం వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక, పౌరాణిక అర్థం ఏమిటి? ముఖ్యంగా ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవికి ఈ ముగ్గులకు ఉన్న సంబంధం ఏంటి? ఈ అద్భుతమైన సంప్రదాయం వెనుక ఉన్న లోతైన కథను, కారణాలను తెలుసుకుందాం..
ముగ్గు-లక్ష్మీదేవి మరియు శుచికి ప్రతీక: ముగ్గు (రంగోలి) వేయడం అనేది కేవలం కళ మాత్రమే కాదు, మన సంస్కృతిలో పరిశుభ్రత (శుచి), ఆహ్వానం యొక్క సంకేతం. హిందూ పురాణాల ప్రకారం, లక్ష్మీదేవి శుభ్రంగా, పరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలలో మాత్రమే నివసించడానికి ఇష్టపడుతుంది. అందుకే ఇంటి యజమానులు ఉదయాన్నే లేచి, ఇంటి పరిసరాలను శుభ్రం చేసి, లక్ష్మీదేవిని సాదరంగా ఆహ్వానించడానికి ముగ్గు వేస్తారు.
ముగ్గులో వేసే చుక్కలు, గీతలు మొత్తం విశ్వం యొక్క నిర్మాణాన్ని, జీవితంలోని సంక్లిష్టత మరియు సామరస్యాన్ని సూచిస్తాయని నమ్ముతారు. ముగ్గు కేంద్రం, ఇల్లు యొక్క శుభ్రతను, ఐక్యతను సూచిస్తుంది. ప్రధానంగా, ధాన్యం పిండితో ముగ్గు వేయడం వెనుక మరో గొప్ప కారణం ఉంది.. అది చిన్న చీమలు, పక్షులు వంటి జీవులకు ఆహారం అందించడం. ఇది మన సనాతన ధర్మంలోని ‘జీవ కారుణ్యం’ మరియు ‘భాగస్వామ్యం’ అనే గొప్ప విలువను ప్రతిబింబిస్తుంది.

ముగ్గు వెనుక ఉన్న పౌరాణిక కథ: పురాణాల ప్రకారం, సముద్ర మథనం జరిగినప్పుడు లక్ష్మీదేవి ఉద్భవించింది. ఆమెను తమ ఇంట్లోకి ఆహ్వానించడానికి దేవతలు, మానవులు అనేక ప్రయత్నాలు చేశారు. లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్లాలనుకున్నా, అక్కడ ఆనందం శ్రేయస్సు ఉండాలని కోరుకుంది. అందుకే ఆమె కేవలం భక్తి ఉన్న ఇంటికి మాత్రమే కాకుండా, పవిత్రత, కళ, మరియు దయ ఉన్న ఇంటికి వెళ్లడానికి ఇష్టపడుతుంది.
ముగ్గు వేయడం ద్వారా, ఆ ఇంటి యజమానులు తమ ఇల్లు పరిశుభ్రంగా ఉందని, కళాత్మకతతో కూడి ఉందని మరియు జీవ కారుణ్యంతో ఉన్నామని లక్ష్మీదేవికి సంకేతం ఇస్తారు. ముగ్గు మధ్యలో వేసే కమలం పువ్వు ఆకారం లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనదిగా భావిస్తారు. ఈ ముగ్గు, లక్ష్మీదేవి ఆకర్షించబడి, ఇంట్లోకి ప్రవేశించడానికి వేయబడిన ఒక అందమైన, ఆధ్యాత్మిక కార్పెట్‌గా భావించవచ్చు. ముగ్గులో వేసే రంగులు జీవితంలోని సంతోషాన్ని, ఉల్లాసాన్ని సూచిస్తాయి.
ముగ్గు వేయడం అనేది కేవలం లక్ష్మీదేవి ఆరాధన మాత్రమే కాకుండా, ఇంటికి వచ్చే అతిథులకు శుభాకాంక్షలు చెప్పే ఒక సాంస్కృతిక సంప్రదాయం కూడా. ఏ పండుగైనా, శుభకార్యమైనా ముగ్గుతోనే ప్రారంభమవుతుంది. ప్రతి ముగ్గు కూడా ఇంటి యజమానుల ఆశీర్వాదం మరియు ప్రేమను సూచిస్తుంది.
