2019-2024 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వమే హింసను ప్రేరేపించిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ కక్ష పూరిత చర్యలకు పోలీసులు ఆయుధాలుగా మారారని తెలిపారు. ఏపీలో టీడీపీ, జనసేన నాయకులపై పెట్టిన కేసుల వివరాలను పవర్ పాయింట్ ప్రజేంటేషన్ చేశారు చంద్రబాబు. తన మీద చిన్నప్పటి నుంచి కూడా ఒక్క కేసు కూడా లేదు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత తనపై 17 కేసులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై 7 కేసులు పెట్టారని పేర్కొన్నారు.
లోకేష్ పాదయాత్రను అడ్డుకున్నారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు రాజమండ్రిలో వంతెన కూడా మూసేశారు. స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేస్తుంటే అరెస్ట్ చేశారు. దూళిపాళ నరేంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారు. ఆదిరెడ్డి అప్పారావు, పత్తిపాటి పుల్లారావు వంటి కుటుంబాలను ఇబ్బంది పెట్టారు. స్పీకర్ అయ్యన్నపై కేసులు పెట్టారు. తప్పుడు కేసులు పెట్టి కోడెలను అవమానించారు. ఆ అవమానంతోనే కోడెల ఊరేసుకుని ఆత్మహత్య చేసుకునేలా చేశారు. ప్రస్తుత హోం మంత్రి అనిత మీద, కొందరు ఎస్సీల మీద కూడా ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టారు. అయ్యన్న మీద అత్యాచారం చేయబోయారనే కేసు పెట్టడం సిగ్గు చేటు. పైల్స్ ఆపరేషన్ చేయించకుని రెస్ట్ తీసుకుంటున్న అచ్చెన్నా ని 600 కిలో మీటర్లు తిప్పారు. రఘురామకృష్ణం రాజును జైల్లో పెట్టి కొడుతుంటే.. ఆనాటి సీఎం ఫోన్లో చూసి ఆనందించారు. రఘు రామకృష్ణం రాజును తన సొంత నియోజకవర్గానికి కూడా వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రధాని తన నియోజకవర్గానికి వచ్చినా రఘురామ వెళ్లలేకపోయారు.