లాక్‌డౌన్ తర్వాత తొలిసారి భారతీయ తెరపై బొమ్మ పడుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లు తెరుచుకోవడానికి మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్‌లాక్ 5.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అక్టోబరు 15 నుంచి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో థియేటర్లు తెరుచుకోవచ్చని ఉత్తర్వులిచ్చింది. దాదాపు 15 రాష్ట్రాలు అనుమతులిచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, తెలంగాణ ఇవ్వలేదు. ఏపీలో మాత్రం థియేటర్లు తెరవకూడదని నిర్ణయించారు యాజమాన్యాలు. లాక్‌డౌన్ కాలానికి థియేటర్ల విద్యుత్ ఛార్జీలు మాఫీ చేయాలనే డిమాండ్‌తో ఈ నిర్ణయం తీసుకున్నారు. దాంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూడాలంటే కొంత కాలం ఆగాల్సి వచ్చేలా ఉంది.
ఏపీలో నేటి నుంచి థియేటర్లు తెరవడం లేదని థియేటర్ల యాజమాన్యాలు తెలిపాయి. విజయవాడలో ఆంధ్రా ఫిల్మ్ ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. లాక్ డౌన్ పీరియడ్‌లో థియేటర్ల కరెంట్ బిల్లులను మాఫీ చేస్తామని ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటి వరకు మాఫీ చేయలేదన్నాయి థియేటర్ల యాజమాన్యాలు . తమ సమస్యలపై దృష్టిపెట్టలేదని, దీంతో థియేటర్లను ఓపెన్ చేసే పరిస్థితి లేదని చెప్పారు.