తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ) పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డితో తీన్మార్ మల్లన్న భేటీ అయ్యారు. సోమవారం ఏఐఎఫ్ బీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో తీన్మార్ మల్లన్నతో పాటు మరికొంత మంది నాయకులుఉన్నారు. కాగా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నారని ఇదివరకే తీన్మార్ మల్లన్న ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీకి రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత ఏర్పడింది.
ఇదిలా ఉంటే.. తీన్మార్ మల్లన్న తను స్థాపించబోయే కొత్త పార్టీని ‘తెలంగాణ నిర్మాణ పార్టీ’ పేరుతో సెప్టెంబర్ నెలలో ఎన్నికల కమిషన్కు అప్లై చేసుకున్నారు. పార్టీ పేరుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాల్సిందిగా ప్రజలను ఈసీ కోరింది. ఈ మేరకు ఈసీ వెబ్‌సైట్‌లో ఒక ప్రకటన జారీ చేసింది. సెప్టెంబర్ 20వ తేదీలోపు అభ్యంతరాలు, ఫిర్యాదు స్వీకరిస్తామని తెలిపింది. తెలంగాణ నిర్మాణ పార్టీ అధ్యక్షుడుగా తీన్మార్ మల్లన్న, ప్రధాన కార్యదర్శిగా మాదం రజనీ కుమార్, కోశాధికారిగా ఆర్ భావన ఉన్నట్లుగా పేర్కొన్నది. కొత్త పార్టీ పెట్టనున్నట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో తీన్మార్ మల్లన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పార్టీ పేరును కూడా అప్పుడే వెల్లడించారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా సురేందర్ రెడ్డితో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.