ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు పూర్తయ్యింది. మే 30న ఈయన ఏపీ సీఎంగా పదవిలోకి వచ్చారు. అప్పట్నుంచి తనదైన ముద్ర వేసుకోడానికి ప్రయత్నిస్తున్నాడు జగన్. ఎన్నికల్లో 151 సీట్లతో ఘన విజయం సాధించిన తర్వాత ఈ ఆరు నెలల పాలనలో నవరత్నాలతో పాటూ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. అయితే వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈ ఆరు నెలల పాలనలో తీసుకున్న ఈ నిర్ణయాలు వివాదాలకు దారితీశాయి. అవేంటంటే.. 5 రూపాయలకే అన్నం పెట్టే పథకాన్ని రద్దు చేయడం ప్రజల్లో తీవ్ర నిరాశను నింపిందని టీడీపీ విమర్శించింది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సరైన ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకోవడం వల్ల ఇసుక లేక సుమారు 35లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు, అనుబంధ రంగాల వారు ఇబ్బంది పడ్డారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అలాగే ప్రభుత్వ భవనాలకు, వాటర్ ట్యాంక్‌లకు, సమాధులకు, గేదెల కొమ్ములకు కూడా వైసీపీ రంగులు వేశారని ఏపీలో వివాదాలు ఏర్పడ్డాయి. ఇక విద్యుత్ ఒప్పందాల పునఃసమీక్ష దేశవ్యాప్తంగా దుమారం రేపింది. అలాగే అమరావతిలో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదిక భవనం కూల్చివేడం. ప్రభుత్వ డబ్బులతో నిర్మించిన భవనాన్నే కూల్చివేయడం వివాదానికి దారి తీసింది.
అదే విధంగా.. ఏపీ చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేయడం సంచలనానికి దారి తీసింది. ఇక 1 నుంచి 6వ తరగతి వరకు తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియం అన్నది రాష్ట్రంలో దూమారం రేపింది. దీనిపై రాష్ట్రంలో తెలుగు భాషను చంపేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఆరు నెలల్లో వైసీపీ ప్రభుత్వం సాధించింది ఏదైనా ఉందంటే అది అప్పుల్లో రికార్డు సృష్టించడమని చంద్రబాబు కూడా విమర్శించారు.