తెలంగాణలో ఒక్క సైనిక్ స్కూల్ కూడా లేదని.. ఏపీలో కోరుకొండ ,పులివెందుల, కలికిరిలో సైనిక్ స్కూల్స్ ఉన్నా అందులో తెలంగాణ వాటా ఎత్తేశారని ప్రణాళిక సంఘం మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే సీఎం కేసీఆర్ సైనిక్ స్కూల్ కోసం కేంద్రం పై ఒత్తిడి తెచ్చారు. వరంగల్ కు సైనిక్ స్కూల్ మంజూరు చేసినా అనేక షరతులు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వమే సైనిక్ స్కూల్ కు అన్నీ ఖర్చులు భరించాలంటే కేసీఆర్ నిరసన తెలిపారు.కేంద్రానికి సుదీర్ఘమైన ఉత్తరం రాశారు.
సీఎం గా రేవంత్ రెడ్డి భాద్యతలు చేపట్టిన వెంటనే సైనిక్ స్కూల్ గురించి నేను లేఖ రాశాను. లేఖ రాశాక రేవంత్ రెడ్డి నన్ను హేళన చేస్తూ మాట్లాడారు. బొల్లారం లో సైనిక్ స్కూల్ వస్తుందని చెప్పారు. ఇప్పటివరకు అతి లేదు గతి లేదు.సైనిక్ స్కూల్ కొత్తది రాలేదు సరికదా..
ఏపీలో ఉన్న సైనిక్ స్కూల్‌లలో తాజాగా తెలంగాణ వారికి ఉన్న రిజర్వేషన్ కోటా ఎత్తేశారు.
ఏపీ ,తెలంగాణ విద్యార్థులకు కలిపి కోరుకొండ ,కలికిరి సైనిక్ స్కూళ్లలో 67 శాతం రిజర్వేషన్లు ఉండేవి.ఇపుడు తెలంగాణకు రిజర్వేషన్లు ఎత్తేసి 67 శాతం ఏపీకే కేటాయించడం దుర్మార్గం.తెలంగాణ విద్యార్థులు అన్యాయమై పోయారు.రాష్ట్ర కాంగ్రెస్ బీజేపీ ఎంపీ లు ఏం చేస్తున్నారు ? ఇలాంటి సమస్యల పై స్పందించకుంటే కాంగ్రెస్ బీజేపీ ఎంపీ లు ఎంచేస్తున్నాటు? ఏపీకి కొత్తగా విజయవాడ లో సైనిక్ స్కూల్ మంజూరు అయింది.
నాలుగు సైనిక్ స్కూళ్ళు ఉంటే తెలంగాణ కు ఒక్కటి లేకపోవడం ఎంత దుర్మార్గం ?.సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ లో కూర్చుని సైనిక్ స్కూల్స్ లో తెలంగాణ కు రిజర్వేషన్లను ఎత్తి వేసిన ఆర్డర్ ను మార్పించాలి.ఇదే విషయమై గతం లో నేను విద్యా కమిషన్ కు లేఖ రాశాను.విద్యా కమిషన్ కేవలం టూర్ల కే పరిమితం అయ్యింది.సైనిక్ స్కూళ్లలో తెలంగాణ విద్యార్ధులకు రిజర్వేషన్లు పునరుద్దరించకపోతే న్యాయ స్థానాలను ఆశ్రయిస్తాం’ అని వినోద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.