వివక్ష పోయే దాకా రిజర్వేషన్లు ఉండాల్సిందే : ఆర్ఎస్ఎస్ చీఫ్ సంచలనం

-

 రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. మన సమాజంలో వివక్ష ఉన్నదని అన్నారు. ఈ అసమానతలు ఉన్నంత కాలం రిజర్వేషన్లు ఉండాల్సిందేనని చెప్పారు. నాగ్‌పూర్‌లోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నేటి యువతర వయోవృద్ధులు అయ్యేలోపు అఖండ భారత్ సాధ్యమేనని తెలిపారు. 1947 తర్వాత మన దేశం నుంచి విడిపోయిన వారు ఇప్పుడు తప్పును తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు.

మరాఠ కోటా కోసం ఆందోళనలు ఉధృతమైన సందర్భంలో మోహన్ భాగవత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రిజర్వేషన్లు ఉండాలని వారి గళానికి సారూప్యంగా కామెంట్ చేశారు.మన తోటి మనుషులను మనం సామాజిక వ్యవస్థలో వెనుకే ఉంచాం. వారి గురించి పట్టించుకోలేదు. ఇది 2000 ఏళ్లపాటు కొనసాగింది. మనం వారికి సమానత్వాన్ని ప్రసాదించాలి. కొన్ని అవకాశాలు కల్పించాలి. అందులో ఒకటి ఈ రిజర్వేషన్లు. కాబట్టి, ఈ వివక్ష కొనసాగినంత కాలం రిజర్వేషన్లు కొనసాగాలి. రాజ్యాంగంలో ఇచ్చిన రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ సమగ్రంగా మద్దతు పలుకుతున్నది’ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కామెంట్ చేయడం సంచలనంగా మారింది.

‘మన సమాజంలో వివక్ష ఉన్నది. అది మన కంటికి కనిపించకపోవచ్చు. కానీ, వివక్ష ఉన్నది’ అని ఆయన స్పష్టం చేశారు. రిజర్వేషన్లు అంటే కేవలం ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసమే కాదు.. వారికి గౌరవం ఇవ్వడం కూడా అని వివరించడం గమనార్హం. మన సమాజంలోని కొన్ని వర్గాలు 2000 ఏళ్లపాటు వివక్షకు గురైనప్పుడు మనం 200 ఏళ్లపాటు సమస్యను ఎందుకు అంగీకరించకూడదు అని అన్నారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news