లాక్‌డౌన్ 5.0 నేపథ్యంలో కేంద్రం జూన్ 8వ తేదీ నుంచి ఆలయాలు, ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలను ఓపెన్ చేసుకోవచ్చని ప్రకటించిన విషయం విదితమే. అందులో భాగంగానే టీటీడీ సహా దేశంలోని అనేక దేవస్థానాలు భక్తులకు మళ్లీ దర్శనం కల్పించడం కోసం సన్నద్ధమవుతున్నాయి. ఇక కేంద్రం ఆలయాల్లో ఆలయ కమిటీలు, భక్తులు పాటించాల్సిన పలు నియమ నిబంధనల జాబితాను తాజాగా విడుదల చేసింది. అందరూ ఈ నియమాలను పాటిస్తూ ఆధ్యాత్మిక ప్రదేశాల్లో తిరగాల్సి ఉంటుంది. మరి నియమ నిబంధనలు ఏమిటంటే…
* ప్రవేశద్వారం వద్ద భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. అక్కడే వారికి హ్యాండ్ శానిటైజర్‌ను అందుబాటులో ఉంచాలి.
* కరోనా లక్షణాలు లేని వారిని మాత్రమే లోపలికి అనుమతించాలి. కేవలం మాస్క్ ధరించిన వారిని మాత్రమే అనుమతించాలి. అలాగే ఆలయం లోపల ఉన్నంత సేపు కచ్చితంగా మాస్క్ ధరించి ఉండేలా చూడాలి.
* కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని ప్రదేశాల్లోనూ అవగాహన కల్పించాలి.
* చెప్పులు, షూస్‌ను సొంత వాహనాల్లోనే వదిలి వచ్చే ఏర్పాటు చేయాలి. అవి లేకపోతే ప్రత్యేకంగా స్టాండ్లు ఏర్పాటు చేయాలి.
* ఆలయాల బయట, లోపల భక్తుల రద్దీ ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. దుకాణాలు, స్టాల్స్, క్యాంటీన్ల వద్ద కచ్చితంగా భౌతిక దూరం పాటించేలా చూడాలి.
* క్యూలైన్లలో మార్కింగ్‌లు గీసి ఆ ప్రకారం మార్కింగ్‌లలో భక్తులను నిలబడమని చెప్పాలి. ఆ ప్రకారమే వారికి దర్శనాలకు అనుమతినివ్వాలి. క్యూలైన్లలో ఒక్కో భక్తుడికి మధ్య కనీసం 6 అడుగుల దూరం పాటించేలా చూడాలి.
* ఆలయం లోపలికి వెళ్లేందుకు ఒక మార్గం, బయటికి వచ్చేందుకు మరొక మార్గం ఉండాలి.
* ఆలయంలో ఏసీలు, వెంటిలేటర్లను సీపీడబ్ల్యూడీ నిబంధనలకు అనుగుణంగా ఉపయోగించాలి. ఆలయాల్లో విగ్రహాలను ఎవరూ తాకకుండా చూసుకోవాలి.
* అన్నదానం చేసేటప్పుడు కచ్చితంగా భౌతిక దూరం పాటించాలి.
* ప్రార్థనా మందిరాలను తరచూ రసాయన ద్రావణాలతో శుభ్రం చేయాలి.
* వాడిన ఫేస్ మాస్కులు, ఇతర వస్తువులను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా నిర్దిష్టమైన ప్రదేశంలోనే వేసేలా చర్యలు తీసుకోవాలి.