బడి ఈడు పిల్లలు బడిలోనే అన్న నినాదం ఎప్పటి నుంచో ఉంది..ఆ నినాదానికి కొనసాగింపు ఇస్తూ బడి ఈడు పిల్లలు బడికి వెళ్లడం ఇక వేడుక అని అంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ నినాదానికి ఆచరణ రూపం ఇస్తూ అమ్మ ఒడికి ఇవాళ శ్రీకాకుళం కేంద్రంగా శ్రీకారం దిద్దుతోంది. మూడో విడతకు సిద్ధం అవుతూ.. మరిన్ని మార్గ దర్శకాలతో సమున్నత ఆశయ సాధనకు, సంపూర్ణ అక్షరాస్యత సాధనకు విద్యా వ్యవస్థ పనిచేయాలని ఆశిస్తూ.. సంబంధిత దిశను నిర్దేశం చేస్తోంది.
పేదరికం కారణంగా ఏ తల్లీ తన బిడ్డలను బండికి పంపలేని దుఃస్థితి రాకూడదని భావించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ
అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించి, నిరాటంకంగా అమలు చేస్తోందని సీఎం జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. పాఠశాలల్లో గణనీయంగా డ్రాపౌట్లను తగ్గించేందుకే అమ్మ ఒడి పథకానికి 75శాతం హాజరు నిర్ణయించాం అని, 2019లో పథకం ప్రవేశపెట్టినప్పుడే సంబంధిత జీఓలోనే ఈ నిబంధనను చేర్చామని స్పష్టం చేస్తున్నారాయన. ప్రస్తుత విద్యా సంవత్సరానికి 51 వేల మంది తల్లులు ఈ పథకాన్ని అందుకోలేకపోవడం బాధాకరమని, భవిష్యత్-లో ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా బిడ్డలను క్రమం తప్పకుండా తల్లులు బడులకు పంపాలని సీఎం విజ్ఞప్తి చేస్తున్నారు. చదువుకు పేదరికం అన్నది అడ్డుకాకూడదు అనే సదుద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని వివరించారు.
ఈ నేపథ్యాన సీఎం జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక అమ్మ ఒడి పథకం ఆరంభం ఇవాళ జరగనుంది. పిల్లలను బడికి పంపే తల్లులకు ప్రోత్సాహకరంగా ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఈ సారి తల్లుల ఖాతాల్లోకి నేరుగా రూ.13 వేలు జమకానున్నాయి. ఈ పథకం ద్వారా అందించే మొత్తంలో స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ , టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద ఒక్కో వెయ్యి చొప్పున రెండు వేల రూపాయలు మినహాయించి తల్లులకు కేటాయించిన 15 వేల రూపాయల్లో 13 వేలు ఇస్తున్నారు. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తైంది. 2019 – 20లో 42,33,098 తల్లులకు 6349.53 కోట్ల రూపాయలు, 2020 – 21 లో 44,48,865 మంది తల్లులకు 6,673 కోట్ల రూపాయలు మొత్తం 19,617.53 కోట్ల రూపాయలు అందించామని ప్రభుత్వం చెబుతోంది.
ప్రతిష్టాత్మక పథకం అమ్మ ఒడికి సంబంధించిన నిధులను సీఎం విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటి దాకా రెండు విడతలలో నిధులు విడుదల చేశారు. మూడో విడతను శ్రీకాకుళం జిల్లా కేంద్రం, కేఆర్ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఆయన రాకకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మరికొద్ది గంటల్లో ఆయన ప్రసంగించనున్నారు. ఈ పథకం ద్వారా ఈ విడతలో ఆరు వేల 595 కోట్ల రూపాయల నిధులను తల్లుల ఖాతాల్లోకి జమ చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ పథకం ద్వారా ఈ సారి 43,96,402 మంది తల్లులకు డబ్బులు అందనున్నాయి. మొత్తం 82 ,31 ,502 మంది విద్యార్థులకు మేలు చేకూరనుంది.