కరోనా లాక్‌డౌన్ కారణంగా ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. వలస కార్మికులు చేసేందుకు పనిలేక, తింటానికి తిండిలేక సొంతూళ్ల బాట పట్టారు. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇలాంటి కష్టసమయంలో బాధితులకు సహాయం చేసేందుకు అనేక మంది మనస్సున్న దాతలు ముందుకు వచ్చారు. ఇంకా సహాయాలు చేస్తూనే ఉన్నారు. ఇక నాగపూర్‌కి చెందిన ఆ డాక్టర్ కూడా తన వంతు బాధ్యతగా కరోనా బాధితులకు సహాయం చేసేందుకు ఏకంగా 1300 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు.
నాగపూర్‌కు చెందిన డాక్టర్ అమిత్ సామ్రాట్ కేవలం డాక్టర్ మాత్రమే కాదు.. సైక్లిస్టు కూడా. అందుకనే ఆయన తన ఇంట్లో ఓ స్టేషనరీ సైకిల్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. అనంతరం దానిపై 1300 కిలోమీటర్ల దూరం వచ్చేలా సైకిల్ తొక్కాడు. ఈ క్రమంలో ఆ కార్యక్రమాన్ని ఆయన లైవ్ టెలిక్యాస్ట్ చేశాడు. దీంతో ఆయన కష్టాన్ని గుర్తించిన అనేక మంది విరాళాలు అందజేశారు. ఈ క్రమంలో ఆయన సైక్లింగ్ ముగించే సరికి రూ.1.70 లక్షలు విరాళంగా అందాయి.
ఇక డాక్టర్ అమిత్ చేసిన కృషిని మహారాష్ట్ర పోలీసులు, నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతినిధులు అభినందించారు. తనకు సపోర్ట్ అందించినందుకు గాను తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు డాక్టర్ అమిత్ ధన్యవాదాలు తెలిపారు. కాగా కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతుగా తాను ఆ విరాళాలను సేకరించానని, వాటిని పేదల కోసం ఉపయోగిస్తానని ఆయన తెలిపారు.