స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవం రోజున జనాలందరూ ఎంతో దేశ భక్తితో జెండాలను ఎగురవేసి వాటికి గౌరవ వందనం చేస్తారు. కానీ చాలా మంది ఆ తరువాత జెండాల గురించి మరిచిపోతారు. దీంతో ఆ పతాకాలు వ్యర్థాల్లో దర్శనమిస్తాయి.
ఆగస్టు 15.. స్వాతంత్య్ర దినోత్సవం… జనవరి 26.. గణతంత్ర దినోత్సవం.. ఈ రెండు రోజుల్లోనూ యావత్ భారత దేశ ప్రజలు మువ్వన్నెల జెండాలను ఎగురవేసి శాల్యూట్ చేసి.. వేడుకలను జరుపుకుంటారు. మన దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహానీయులను గుర్తు చేసుకుంటారు. అంతా బాగానే ఉంటుంది. కరెక్ట్… భారతీయులు అన్నాక కచ్చితంగా దేశభక్తి చూపించాలి. ఆయా వేడుకల్లో పాల్గొనాలి. కానీ ఆయా వేడుకలు అయిన మరుసటి రోజే చాలా ప్రాంతాల్లో జాతీయ జెండాలు చెత్త కుప్పల్లో, రోడ్లపై, ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తాయి. కొందరు వాటిని నిర్లక్ష్యంగా పడేస్తుంటారు. కానీ.. నిజానికి అది మంచి పద్దతి కాదు. అలా చేయకూడదని చాటి చెబుతూ.. ఆ వ్యక్తి వ్యర్థాల్లో పడి ఉండే జాతీయ జెండాను సేకరిస్తుంటాడు. అతనే కోల్‌కతాకు చెందిన ప్రియ రంజన్ సర్కార్..
ప్రియ రంజన్ సర్కార్ పశ్చిమబెంగాల్ లోని బాలి వాసి. కోల్‌కతాలో ఉంటున్నాడు. అతనికి 3 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. తల్లి ఎంతో శ్రమకోర్చి అతన్ని పెంచింది. అతనికి మరో ముగ్గురు సోదరులు కూడా ఉండేవారు. అయితే ప్రియ రంజన్ అందరిలా సాధారణ వ్యక్తి కాదు. అతను మూగ కావడంతో స్కూల్‌లో తోటి విద్యార్థులు, బయట అతన్ని అందరూ ఎగతాళి చేసేవారు. అయినా ఎన్నో కష్టాల కోర్చి అతను ముందుకు సాగాడు. అయితే అతను ఒకసారి తన తల్లి రోడ్లపై పడి ఉన్న జాతీయ జెండాలను సేకరించేటప్పుడు చూసి ప్రేరణ పొందాడు. అలా ఎందుకు చేస్తున్నావని ఆమెను అడిగితే.. జాతీయ జెండా అంటే భరతమాతకు చీరలాంటిదని, దాన్ని అగౌరవ పరచకూడదని ఆమె చెప్పడం అతన్ని ఆకట్టుకుంది. దీంతో అప్పటి నుంచి అతను ప్రతి ఏటా ఆగస్టు 15, జనవరి 26వ తేదీల తరువాతి రోజుల్లో వ్యర్థాల్లో పడి ఉండే జాతీయ జెండాలను సేకరించడం మొదలు పెట్టాడు. అలా గత 9 ఏళ్లుగా అతను ఆ పని చేస్తున్నాడు.
స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవం రోజున జనాలందరూ ఎంతో దేశ భక్తితో జెండాలను ఎగురవేసి వాటికి గౌరవ వందనం చేస్తారు. కానీ చాలా మంది ఆ తరువాత జెండాల గురించి మరిచిపోతారు. దీంతో ఆ పతాకాలు వ్యర్థాల్లో దర్శనమిస్తాయి. అందుకని ఆ పతాకాలకు జరిగే అవమానాన్ని భరించలేక ప్రియరంజన్ వాటిని సేకరించడం ప్రారంభించాడు. అందుకుగాను తన ఇంట్లోను ప్రత్యేక ఏర్పాటు చేశాడు. అయితే ఆ పతాకాలను సేకరించేటప్పుడు గతంలో అతను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. సరిగ్గా మాట్లాడలేడు కాబట్టి అందరూ అతన్ని దొంగ అనుకుని కొట్టేందుకు యత్నించేవారు. అయినప్పటికీ ప్రియరంజన్ ఆ అవమానాలను భరించి ముందుకు సాగాడు. ఇప్పుడు ప్రియరంజన్ చేస్తున్న పనిని స్ఫూర్తిగా తీసుకుని అనేక మంది అతని వద్ద వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. రోడ్లపై వ్యర్థాల్లో పడి ఉండే జాతీయ పతాకాలను వారు సేకరిస్తున్నారు. అవును మరి.. జాతీయ జెండాకు కేవలం వందనం చేయడం మాత్రమే కాదు, దాని గౌరవాన్ని కూడా కాపాడాలి. అలాంటి పని చేసే వారే నిజమైన దేశ భక్తులు అవుతారు..!