కరోనా నేపథ్యంలో బయటకు వెళ్లాలంటేనే జనాలకు భయం వేస్తోంది. ఎక్కడ కరోనా వ్యాప్తి చెందుతుందోనని భయపడుతున్నారు. బయటకు వెళ్లినా మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లను తప్పనిసరిగా వాడుతున్నారు. అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కరోనా వస్తుందా, రాదా.. అంటే డౌటే. ఈ క్రమంలో జనాల్లో విపరీతమైన భయాందోళనలు నెలకొన్నాయి. అయితే అలాంటి భయం నుంచి కొంత వరకైనా ఉశమనం కలిగించవచ్చని చెప్పి ఆ ప్రొఫెసర్ ఏకంగా ఓ కోవిడ్ జాకెట్‌నే డిజైన్ చేశారు. దాన్ని ధరిస్తే కరోనా లాంటి వైరస్‌లే కాదు, బాక్టీరియా ఇన్ఫెక్షన్లు కూడా రాకుంటాయి.
అహ్మదాబాద్‌లోని ఎన్ఐడీ మాజీ ప్రొఫెసర్, అప్పారెల్ మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ సోమేష్ సింగ్ కొత్తగా కోవెస్ట్ పేరిట ఓ జాకెట్‌ను డిజైన్ చేశారు. అందులో నాలుగు పొరలతో ప్రొటెక్షన్ లభిస్తుంది. 2 నెలల సమయం పాటు కష్టపడి ఆయన ఈ జాకెట్‌ను తయారు చేశారు. సిమెంట్ ఫ్యాబ్రిక్, సింథటిక్ పదార్థాలు కలిపి లెదర్ జాకెట్ లుక్ వచ్చేలా ఆయన ఈ జాకెట్‌ను రూపొందించారు. అనంతరం జాకెట్‌పై వైరోబ్యాన్-ఎన్9 ఎస్సీ100 కోటింగ్ వేశారు. అందువల్ల ఈ జాకెట్ బాక్టీరియా, వైరస్‌ల నుంచి రక్షణ ఇస్తుంది. అలాగే ఈ జాకెట్‌లో సోషల్ డిస్టన్సింగ్ సెన్సార్‌ను కూడా ఏర్పాటు చేశారు. అందువల్ల ఆ దూరం పాటించకపోతే ఈ జాకెట్ అలర్ట్ ఇస్తుంది.
ఇక ఈ జాకెట్‌కు ఇన్‌బిల్ట్ మాస్కును కూడా అందిస్తున్నారు. ఈ జాకెట్‌కు ఉన్న జేబుల్లో వాహనాల తాళం చెవులు, స్మార్ట్‌ఫోన్లు, పర్సులు, క్రెడిట్, డెబిట్ కార్డులను వేస్తే 30 సెకన్లలో అవి శానిటైజ్ అవుతాయి. అందుకుగాను జేబులకు లోపలి వైపు యూవీ లైట్‌ను ఏర్పాటు చేశారు. అది ఆయా వస్తువులపై ఉండే క్రిములను చంపుతుంది. ఇలా మన వస్తువులు కూడా పూర్తిగా శానిటైజ్ అవుతాయి. ఇక ఈ జాకెట్‌కు ఓ థర్మామీటర్‌ను కూడా అమర్చారు. అందువల్ల శరీర ఉష్ణోగ్రతను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
ప్రస్తుతం సోమేష్ సింగ్ ఈ జాకెట్‌కు పేటెంట్ తీసుకునే పనిలో పడ్డారు. ఆ ప్రక్రియ పూర్తయితే సెప్టెంబర్ నుంచి ఈ జాకెట్‌ను ఆయన మార్కెట్‌లో విక్రయిస్తానని చెబుతున్నారు. రూ.4,999 ధరకు ఈ జాకెట్ అందుబాటులో ఉంటుందని, S, M, L, XL సైజుల్లో ఈ జాకెట్ లభిస్తుందని తెలిపారు.