డిప్యూటీ సీఎం టార్గెట్ గా ఆ నేతలంతా ఒక్కటయ్యారా

-

డిప్యూటీ సీఎంకి చెక్ పెట్టేందుకు విజయనగరం జిల్లాలో నేతలంతా ఒక్కటవుతున్నారు.పంచాయతీ ఎన్నికల వేళ డిప్యూటీ సీఎం కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి దూకుడు ని అడ్డుకునేందుకు రెండు రాజవంశాలు ఏకమవుతున్నాయట..అయితే ఇందులో మంత్రి సొంత కుటుంబసభ్యులు కూడా ఉండటం విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఆసక్తిరేపుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో రాజవంశాల పేరు చెబితే గుర్తోచ్చేది విజయనగరం జిల్లా. పూసపాటి గజపతిరాజులు..బొబ్బిలి రాజులు.. చినమేరంగి రాజులు.. కురుపాం సంస్థానం ఇలా జిల్లా అంతా రాజవంశాలతోనే కనిపిస్తూ ఉంటుంది. రాచరికాలు పోయినా.. పొలిటికల్‌ తెరపై ఈ వంశాలకు చెందినవారు కనిపిస్తూ వస్తున్నారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఆ వంశాలలో నేతలు కీలక పాత్ర పోషిస్తూ తమ హవా కొనసాగిస్తున్నారు.జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో కురుపాం ఒకటి. ఇప్పుడు కురుపాం కేంద్రంగా సరికొత్త రాజకీయం నడుస్తుందట..

కురుపాం ఏజెన్సీ ప్రాంతమే అయినా.. ఇక్కడి నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు దేశ, రాష్ట్ర రాజకీయాలలో తమదైన ముద్ర వేశారు. కురుపాం సంస్థానానికి చెందిన కిశోర్‌ చంద్రదేవ్‌ కేంద్రమంత్రిగా పనిచేశారు. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజులు సైతం ఈ ప్రాంతానికి చెందినవారే. వీరిద్దరూ సొదరులు కూడా. 2014లో శత్రుచర్ల కుటుంబ కోడలు పుష్పశ్రీవాణి ఎమ్మెల్యే అయ్యారు. 2019లో ఆమె రెండోసారి గెలిచి ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారు.

శత్రుచర్ల సోదరులిద్దరూ ఇప్పుడు చెరోపార్టీలో ఉన్నారు. విజయరామరాజు టీడీపీలోనూ.. చంద్రశేఖర్‌రాజు వైసీపీలో కొనసాగుతున్నారు. అయితే పుష్పశ్రీవాణి డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచీ కుటుంబ సభ్యుల మధ్య గ్యాప్‌ వచ్చిందట. మామ,కోడలి మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. కురుపాంలో పుష్పశ్రీవాణి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని ఏకంగా రోడ్డెక్కారు మామ చంద్రశేఖర్‌రాజు. ఇప్పుడు అన్న విజయరామరాజు, కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌తో కలిసి కురుపాం కోటలో రహస్య సమావేశం నిర్వహించారని ప్రచారం జరుగుతోంది.

కురుపాం మేజర్‌ పంచాయతీలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి నిలబెట్టిన వైసీపీ మద్దతుదారులను ఓడించి.. టీడీపీ సపోర్టర్స్‌ను గెలిపించాలని ముగ్గురు నేతలు చర్చించారన్న ప్రచారం ఒక్కసారిగా స్థానిక రాజకీయాన్ని వేడెక్కించింది. ఇదే అంశంపై తమ అనుచరులకు సంకేతాలు కూడా పంపారని అనుకుంటున్నారు. కేవలం పుష్పశ్రీవాణిని అడ్డుకునేందుకే మంత్రాంగం రచించారని తెలుసుకున్న వైసీపీ శ్రేణులు కూడా ఆలోచనలో పడ్డాయట. ఈ అంశంపై ఎవరికి వారుగా విశ్లేషణ చేస్తున్నారు. స్థానిక ఎన్నికల వేళ కురుపాంలో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి విజయనగరం జిల్లాలో కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version