బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటే అని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు శనివారం ఆయన కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పాటనే కిషన్ రెడ్డి పాడుతున్నారని, పెట్టుబడులను చూసి కిషన్ రెడ్డి గర్వించాల్సింది పోయి శాపనార్ధాలు పెట్టేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
కిషన్ రెడ్డికి చేతనైతే తెలంగాణకు కొత్త ప్రాజెక్టులు తేవాలని సూచించారు. పేదలకు ఉపయోగపడే ఒక్క పథకమైనా బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఆ నలుగురికి దోచిపెడితే బీజేపీ ప్రభుత్వం ఓ ఇద్దరికి దోచిపెడుతోందని ఆరోపించారు.కాగా, నిన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇక్కడి వారినే దావోస్ తీసుకువెళ్లి అక్కడ ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. దావోస్ పెట్టుబడులు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా వాస్తవ రూపం దాల్చాలని ఆశించారు.