సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆ ఇద్దరు వైసీపీ మంత్రులు

-

ఆ ఇద్దరి పేర్లు ఒకటే…ఇద్దరు మంత్రులే…ఇద్దరి జిల్లా కూడా ఒకటే… తిట్లపురాణంలో ఇద్దరి స్పీడు ఒకటే..ఒకరిది నేరుగా ఉంటే…ఇంకొకరిది వ్యంగ్యం అంతే తేడా… ఇద్దరిలో అనేక పోలీకలు ఒక్కటిగా ఉన్న ఆ ఇద్దరూ ఇప్పుడు తిట్ల దండకంలో ఒకరికి ఒకరు పోటీగా తయారయ్యారు. ఇది తమ మంత్రి పదవుల పొడిగింపు కోసమా లేక ఎదురుదాడితో విపక్షాల నోరు నొక్కడమా అన్న చర్చ నడుస్తుంది. ఆ ఇద్దరే కృష్ణాజిల్లాకు చెందిన మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని. ఇద్దరు నానిలు తమ తమ కామెంట్స్ తో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారట…

కొడాలి నాని, పేర్ని నాని…జగన్ క్యాబినెట్ లో కృష్ణాజిల్లా నుంచి తొలి దఫాలోనే బెర్త్ లు దక్కించుకున్నారు. కొడాలి నాని నాలుగుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రవ్వగా పేర్ని నాని ఐదుసార్లు పోటీ చేసి మూడు సార్లు గెలిచి మంత్రయ్యారు. వీరిలో కొడాలి నాని టీడీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా, పేర్ని నాని మాత్రం కాంగ్రెస్ నుంచి 3,వైసీపీ నుంచి 2సార్లు పోటీచేసి ఒకసారి గెలిచారు. కొడాలి నాని మొదటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు లోకేష్, దేవినేని ఉమా వంటి ఆ పార్టీ నేతలపై దూకుడుగానే విమర్శలు చేసే వారు.

అయితే మంత్రి పదవి వచ్చిన తర్వాత కొడాలి నాని ఒక్క చంద్రబాబు విషయమే కాకుండా అన్ని విషయాల్లో ఒంటి కాలిపై విమర్శలు చేస్తూ పార్టీని కూడా పలుమార్లు చిక్కుల్లో పడేశారు. టీటీడీలో సీఎం డిక్లరేషన్ విషయంలో, మూడు రాజధానుల విషయంలో, అమరావతి రాజధాని అక్కర్లేదంటూ కొడాలి నాని చేసిన కామెంట్స్ సొంత పార్టీలో కూడా చర్చకు దారితీశాయి. టీటీడీ డిక్లరేషన్ విషయంలో కొడాలి వ్యాఖ్యల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందనే కామెంట్లు కూడా సొంత పార్టీలో ఉన్నాయి.

ఇక పేర్ని నాని తీరు పరిశీలిస్తే కూడా గతంలో కంటే మంత్రిగా మారిన తర్వాత ఆయనలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. చంద్రబాబు మొదలుకుని పవన్ కళ్యాణ్,నిమ్మగడ్డ వరకు అన్ని అంశాలపై వ్యంగ్యాలతో కూడిన చమత్కారాలతో పేర్ని నాని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల చంద్రబాబుపై పేర్ని ఒకింత వెగుటైన వ్యాఖ్యలే చేశారు. చంద్రబాబు ముసలివన్నీ కట్టకడతాం, చంద్రబాబు వయాగ్రా వాడినట్టు ఊగిపోతున్నారనే పదజాలన్ని వాడారు. దీంతో పాటు సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ విమర్షించిన ప్రతిసారి పేర్ని నాని రంగంలోకి దిగి పవన్ పై ఒంటికాలిపై లేస్తున్నారు.

ఇటు పేర్ని నాని, అటు కొడాలి నాని ఇద్దరు కూడా ఒకరికి ఒకరు పోటీగా తిట్ల దండకం అందుకోవడంతో సొంత పార్టీలో కూడా వీరి పై ఆసక్తికర చర్చ నడుస్తుందట..తొలి క్యాబినెట్ లో మంత్రులకు రెండున్నరేళ్ళ కాలపరిమితి మాత్రమే ఉంటుందన్న జగన్ వ్యాఖ్యలే నానిల మధ్య పోటీకి కారణమనే గుసగుసలు నేతల మధ్య వినిపిస్తున్నాయి. కృష్ణాజిల్లాలో ఇద్దరు నానిలతోపాటు వెలంపల్లి కూడామంత్రిగా ఉన్నారు. రెండున్నరేళ్ళ తర్వాత క్యాబినెట్ లో మార్పులు ఉంటాయని జగన్ ముందే చెప్పారు. దీనితో ఆయన దృష్టిలో పడేందుకు నానిల విమర్శలు శృతి మించుతున్నాయనే కామెంట్స్ కూడా పార్టీలో వినిపిస్తున్నాయి. ఇక ఈ నాని బ్రదర్స్ కామెంట్స్ ని కూడా వైసీపీ శ్రేణులు తెగ వైరల్ చేస్తున్నాయట..వీరిద్దరి దూకుడు ఇలాగే కొనసాగుతుందో ఎలాంటి మార్పు వస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version