పులి సంచారం మంచిర్యాల జిల్లా చెన్నూరు అటవీ సబ్ డివిజన్ పరిధిలోని కోటపల్లి అడవుల్లో కలకలం రేపుతోంది. పశువులపై దాడి చేస్తుండటంతో సమీప గ్రామాల ప్రజల్లో మరోసారి భయం పట్టుకుంది. గత ఏడు సంవత్సరాలుగా మహారాష్ట్రలోని తడోబా అడవుల నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ మీదుగా ఈ ప్రాంతానికి రాకపోకలు సాగిస్తున్నాయి. కోటపల్లి మండలం పిన్నారం అడవుల్లో 2016లో వేటగాళ్ల ఉచ్చుకు చిక్కి ఓ పెద్దపులి మృత్యువాత పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.
అప్పటి నుంచి పులుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించిన అటవీశాఖ వాటికి అనువుగా వాతావరణం కల్పిస్తున్నారు. గతంలో ఈ అడవుల్లో కే4 పులితో పాటు జే1, ఎస్8 నామకరణంతో కూడిన ఇతరత్రా పులులను వాటి అడుగుజాడల ఆధారంగా అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం వాటి కదలికలు అంతగా లేకపోవడంతో వివిధ ప్రాంతాలకు తరలి పోయాయని భావిస్తున్న తరుణంలో.. గత 20 రోజుల నుంచి తూర్పు ప్రాంతంలో సంచరిస్తున్న ఓ పులితో మరోసారి అలజడి రేకెత్తింది.