ఓ సర్పంచ్ భర్తను కొందరు దుండగులు దారుణంగా హతమార్చిన ఘటన నల్గొండ జిల్లా తిప్పర్తిమండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. కత్తులు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా హత్య చేసిన దుండగులు అనంతరం మృతదేహాన్ని కాల్వలో పడవేసి వెళ్లారు. అసలేం జరిగిందంటే..
నల్గొండ జిల్లా తిప్పర్తిమండలం ఎల్లమ్మగూడెం సర్పంచ్ సంధ్య భర్త విజయ్‌రెడ్డిని దుండగులు దారుణంగా హత్యచేశారు. పొలం పనులు ముగించుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు తొలుత ఆయన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. అనంతరం కత్తులు, గొడ్డళ్లతో విచక్షణా రహితంగా దాడి చేయడంతో విజయ్‌రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం మృతదేహాన్ని కాల్వలో పడేసి వెళ్లిపోయారు.
2019 లో జరిగిన ఎన్నికల్లో విజయ్‌రెడ్డి భార్య సంధ్య తెరాస మద్దతుతో సర్పంచ్ గా ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో తెరాస నుంచి విజయ్‌రెడ్డికి టిక్కెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో తెరాస నుంచి ఆయనను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్, భాజపాలో కొంతకాలం పనిచేశారు. అయితే విజయ్‌రెడ్డి భార్య సంధ్య నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలతో అధికారులు ఆమెకు చెక్‌పవర్ రద్దుచేశారు.
నల్గొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి గ్రామాభివృద్ధి కోసం ఖర్చుచేసిన బిల్లులు రాకుండా కావాలనే నిలిపివేయించడం సహా చెక్‌పవర్ రద్దు చేశారని ఆరోపిస్తూ విజయ్‌రెడ్డి, సంధ్య కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ తరుణంలో ఆయన హత్యకు గురికావడం కలకలం రేపింది. తన భర్త హత్య వెనుక ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, ఎంపీటీసీ సందీప్‌రెడ్డి. పలువురు కాంగ్రెస్ నేతల హస్తం ఉందని ఆమె ఆరోపిస్తున్నారు.