తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. శనివారం సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు పుణ్యహవచనం, రక్షా బంధనం, ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించిన తర్వాత శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. అంకురార్పణ ఘట్టంలో ముందుగా భగవంతుడి అనుజ్ఞ తీసుకుని షోడషోపచారాలు సమర్పించారు. సమస్తమైన విఘ్నాలు తొలగేందుకు విష్వక్సేనారాధన నిర్వహించారు. అనంతరం స్థల శుద్ధి, ద్రవ్యశుద్ధి, శరీర శుద్ధి, ఆత్మశుద్ధి కోసం పుణ్యహవచనం చేపట్టారు.
అంకురార్పణ కార్యక్రమంలో ప్రధాన ఘట్టం మృత్సంగ్రహణం. అమ్మవారి ఆలయం వద్దగల శుక్రవారపు తోటలో ఈశాన్య దిశలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా శ్రీభూవరాహస్వామిని ప్రార్థించి, గాయత్రి అనుష్టానం, భూసూక్తం పారాయణం చేశారు. ధూప, దీప నైవేద్యం సమర్పించి మాషాచోప (మినుముల అన్నం) బలిహరణ చేశారు. ఆ ప్రాంతాన్ని గోమూత్రం, గోమేయంతో శుద్ధి చేసి భూమాతను ఆవాహన చేసి వస్త్ర సమర్పణగావించారు.