తిరుపతి బైపోల్..వైసీపీ నుంచి తెరపైకి కొత్త అభ్యర్ధి

-

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందు నుంచే ఏదో ఒక పొలిటికల్ హైప్ తో రాజకీయవర్గాల్లో ఆసక్తిరేపుతుంది. ముందుగా అభ్యర్దిని ప్రకటించి ఆ తర్వాత సైలెంటయింది టీడీపీ. బీజేపీ-జనసేన అభ్యర్ది ఎవరన్నది ఇక నోటిఫికేషన్ వచ్చేదాక కొలిక్కి వచ్చేలా లేదు. అధికార వైసీపీ కూడా అభ్యర్ధిని ప్రకటించింది. కానీ పోటీచేసే అభ్యర్థి విషయంలో వైసీపీ పునరాలోచనలో పడిందా అన్న చర్చ తాజాగా నడుస్తుంది. అధికార పార్టీలో అభ్యర్ది విషయంలో కొత్త చర్చ నడుస్తుందట…


గత ఏడాది సెప్టెంబర్‌లో కరోనా బారిన పడి అకాల మరణం చెందారు తిరుపతి లోక్‌సభ సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్‌. దీంతో ఈ నియోజకవర్గానికి త్వరలో ఉపఎన్నిక జరగబోతోంది. నిబంధనల ప్రకారం ఆరు నెలలలోపు ఎలక్షన్‌ జరగాలి. అంటే ఈ ఏడాది మార్చి లోపు ఆ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది. ఇప్పటికే అక్కడ ఎన్నికల రాజకీయం వేడెక్కింది. రాజకీయపార్టీలలో సందడి మొదలైంది. టీడీపీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటి చేసి ఓటమిపాలయిన పనబాక లక్ష్మికి తిరిగి అవకాశమివ్వగా వైసీపీ నుంచి డాక్టర్‌ గురుమూర్తి పేరు ప్రచారంలోకి వచ్చింది.

ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరైనా పదవిలో ఉండగా చనిపోతే.. ఉపఎన్నికలో ఆ నాయకుడి కుటుంబంలోని వారికి టికెట్‌ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే వివిధ కారణాల వల్ల వైసీపీ మాత్రం బల్లి దుర్గా ప్రసాద్‌ కుటుంబంలోని వారికి కాకుండా వేరేవాళ్లకి టికెట్‌ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రత్యామ్నాయంగా బల్లి దుర్గాప్రసాద్‌ కుమారుడికి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారట. ఆ తర్వాత డాక్టర్‌ గురుమూర్తి పేరు అనధికారికంగా బయటకు వచ్చింది. ఆర్థోపెడిక్‌ సర్జన్‌ అయిన గురుమూర్తి జగన్‌ పాదయాత్ర సమయంలో ఆయనకు వైద్య సేవలు అందించారు. అందుకు ప్రతిఫలంగా తిరుపతి టికెట్‌ ఇస్తున్నారనే చర్చ జరిగింది.

అయితే జగన్‌ కోర్‌ టీమ్‌లోని నేతలు.. సన్నిహిత వర్గాలు దీనిపై పునరాలోచనలో పడ్డాయని టాక్‌. పార్టీకి సేవలందించడం కాకుండా.. నాయకుడికి సేవలు చేయడం అనే ప్రాతిపదిక పై టికెట్‌ ఇస్తే కేడర్‌కు తప్పుడు సంకేతాలు వెళ్తాయనే చర్చ మొదలైందట. ఇదే విషయాన్ని క్లోజ్‌ సర్కిల్స్‌ సీఎం ముందు పెట్టాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ వాదనతో సీఎం కన్వెన్స్‌ అయ్యారని.. డాక్టర్‌ గురుమూర్తి పేరును పక్కన పెట్టినట్టే అని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ విషయం తెలుసుకున్న ఆశావహలు మరోసారి లాబీయింగ్‌ ముమ్మరం చేశారట. గురుమూర్తి పేరు బయటకొచ్చాక.. తమ ప్రయత్నాలను పక్కన పెట్టిన చాలా మంది నాయకులు… మళ్లీ తమ దరఖాస్తులను కోర్‌ టీమ్‌ సభ్యులకు అందజేసి ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌ అని అడుగుతున్నారట. మరి.. ఉప ఎన్నికకు గడువు దగ్గర పడుతున్న సమయంలో తిరుపతి వైసీపీ టికెట్‌ ఎవరికి లభిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version