తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలనే దిశగా పాలన కొనసాగిస్తున్నారు. ఒక్కసారిగా కేబినెట్ విస్తరణ చేసుకుని పాలనలో సమయస్పూర్తిగా వ్యవహరిస్తూ ముందుకు వెళుతున్నారు. అయితే అధికార పీఠం అధిరోహించి 100 రోజులు కావొస్తున్న నేపథ్యంలో జగన్ మంత్రుల పనితీరుపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తమ శాఖల విషయంలో పూర్తిగా పట్టు సాధించి, మంచి పని తీరు కనబరిచే మంత్రులని జాగ్రత్తగా గమనిస్తున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో పని తీరు బాగోని, ప్రతిపక్ష టీడీపీ విమర్శలకు కౌంటర్లు ఇవ్వని మంత్రులపై కూడా జగన్ నిఘా పెట్టినట్లు సమాచారం. జగన్ కేబినెట్ విస్తరణ చేసినప్పుడు మంత్రులు పూర్తికాలంలో పదవిలో ఉండరని, పనితీరు సరిగా లేని వారిని మధ్యలోనే తప్పించవచ్చని ప్రకటనలు కూడా చేశారు. ఈ సమయంలోనే పనితీరు బాగున్న టాప్-5 మంత్రులని పూర్తి పదవీకాలంలో కొనసాగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అలా జగన్ అనుకున్న విధంగా టాప్-5లో ఈ మంత్రులు ఉండొచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పైగా ఆ అయిదుగురుకి పూర్తి కాలం పదవిలో ఉంటారని జగన్ హామీ ఇచ్చారని తెలుస్తోంది. అయిదుగురిలో మొదటిగా వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉండే మోపిదేవి వెంకటరమణ ఉన్నారని సమాచారం. గుంటూరు రేపల్లె నుంచి పోటీ చేసిన్ ఓడిపోయిన మోపిదేవిని జగన్ మంత్రి చేశారు. అలాగే తాజాగా ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. కాబట్టి ఈయన కేబినెట్లో పూర్తికాలం కొనసాగడం ఖాయం. ఇక వైఎస్ కేబినెట్ లో మంత్రిగా ఉండి ఆయన మరణానంతరం జగన్ వెంట నడిచిన మరో కీలక నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఇప్పుడు మంత్రి పదవి దక్కింది. వివాదరహితుడుగా పేరున్న ఈయనను కేబినెట్ లో చివరి వరకు కొనసాగించవచ్చు.
జగన్ కు ఎప్పుడు ఆర్థికంగా,నైతికంగా మద్దతుగా ఇచ్చే చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఐదేళ్లు కొనసాగడడం ఖాయం. ఆ తర్వాత వైఎస్ కేబినెట్ లో మంత్రిగా చేసిన బొత్స సత్యనారాయణ కూడా జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. ఉత్తరాంధ్ర లో కీలక నేతగా ఉన్న ఈయన ఐదేళ్లు నిస్సందేహంగా మంత్రివర్గంలో ఉంటారనే చర్చ జరుగుతోంది. అటు మరో సీనియర్ నేత, వైఎస్ కుటుంబానికి దూరపు బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా మంత్రివర్గంలో పూర్తి ఉంటారని తెలుస్తోంది.
ఇక ఐదుగురు మినహా కొత్తగా మంత్రులైన వారు, సామాజిక కోణంలో మంత్రులైనవారిపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద 20 మంది మంత్రులు రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణలో పదవులు కోల్పోవడం గ్యారెంటీ అన్న ప్రచారం వైసీపీలో శ్రేణుల్లో సాగుతోంది.