ఎడ‌మ‌చేయి నొప్పిగా ఉంటుందా..? గుండె స‌మ‌స్యే కాదు, ఇవి కూడా కార‌ణం కావ‌చ్చు..!

-

సాధార‌ణంగా హార్ట్ ఎటాక్ వ‌చ్చే ఎవ‌రికైనా స‌రే ఎడ‌మ చేయి బాగా నొప్పిగా ఉంటుంది. భుజం నుంచి చేయి కింద వ‌ర‌కు లాగిన‌ట్టు నొప్పి వ‌స్తుంది. అలాగే ఛాతి మ‌ధ్య‌లో నొప్పి మొద‌లై పైకి వ్యాపిస్తుంది. ఇక కొంద‌రికి ఎడ‌మ వైపు ద‌వ‌డ నొప్పిగా ఉంటుంది. ఇవ‌న్నీ హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌ని తెలిపే ల‌క్ష‌ణాలు. అయితే ఇవి లేకుండా కేవ‌లం ఎడ‌మ చేయి నొప్పి మాత్ర‌మే ఉంటే దాన్ని చాలా మంది గుండె స‌మ‌స్య అని భావిస్తుంటారు. కానీ కింద తెలిపిన ప‌లు కార‌ణాల వ‌ల్ల కూడా కొంద‌రికి ఎల్ల‌ప్పుడూ ఎడ‌మ చేయి నొప్పిగా ఉంటుంది. మ‌రి ఆ కార‌ణాలు ఏమిటంటే…

* నిద్రించే భంగిమ‌, కంప్యూట‌ర్ ఎదుట కూర్చునే భంగిమ స‌రిగ్గా లేక‌పోయినా ఎడ‌మ చేయి నొప్పిగా అనిపిస్తుంది. ఆ భంగిమ‌ను స‌రి చేసుకోవ‌డం ద్వారా ఆ నొప్పిని త‌గ్గించుకోవ‌చ్చు.

* శ‌రీరంలో ర‌క్త ప్ర‌స‌ర‌ణ స‌రిగ్గా లేక‌పోయినా కొన్ని సార్లు ఎడ‌మ చేయి నొప్పి వస్తుంటుంది. దీన్ని త‌గ్గించుకోవాలంటే నిత్యం వ్యాయామం చేయాలి. స‌రైన పౌష్టికాహారం తీసుకోవాలి. మ‌ద్య‌పానం, ధూమ‌పానం మానేయాలి. అలాగే కెఫీన్ ఎక్కువ‌గా ఉండే టీ, కాఫీలు అతిగా తాగ‌రాదు. నిత్యం త‌గినంత నీటిని తాగాలి. స‌మ‌యానికి నిద్ర పోవాలి. దీంతో ర‌క్త ప్ర‌స‌ర‌ణ మెరుగు ప‌డుతుంది.

* కొన్ని సార్లు గ్యాస్‌, అసిడిటీ స‌మ‌స్య వ‌ల్ల కూడా ఎడ‌మ చేయి నొప్పి వ‌స్తుంటుంది. దీన్ని నివారించేందుకు వైద్యుల వ‌ద్ద‌కు వెళ్లి చికిత్స తీసుకోవాలి. గ్యాస్‌, అసిడిటీ త‌గ్గితే కొంద‌రికి ఎడ‌మ చేయి నొప్పి కూడా త‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది. అందుక‌ని ఆ స‌మ‌స్య‌కు చికిత్స తీసుకుంటే ఆటోమేటిగ్గా నొప్పి కూడా త‌గ్గుతుంది.

* క్యాన్స‌ర్ చికిత్సలో భాగంగా వాడే కీమో థెర‌పీ మందులు, కొలెస్ట్రాల్‌ను త‌గ్గించే స్టాటిన్ డ్ర‌గ్స్‌ను ఎక్కువ‌గా వాడ‌డం వ‌ల్ల కూడా కొన్ని సార్లు ఎడ‌మ చేయి నొప్పిగా అనిపిస్తుంది. అందుకు గాను వైద్యుడిని క‌లిసి స‌రైన మెడిసిన్ ఇచ్చేలా చూసుకోవాలి. దీంతో నొప్పిని త‌గ్గించుకోవ‌చ్చు.

పైన తెలిపిన సూచ‌న‌ల మేర‌కు త‌గిన విధంగా స్పందిస్తే ఎడ‌మ చేయి నొప్పిని త‌గ్గించుకోవ‌చ్చు. అయితే అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకున్న‌ప్ప‌టికీ, పైన తెలిపిన స‌మ‌స్య‌లు ఏవీ లేన‌ప్ప‌టికీ ఎడ‌మ చేయి ఇంకా నొప్పిగా ఉంటే.. అప్పుడు దాన్ని క‌చ్చితంగా గుండె స‌మ‌స్య‌గా అనుమానించాలి. వెంట‌నే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లి ఆ మేర‌కు వైద్య ప‌రీక్ష‌లు చేయించుకుని అందుకు త‌గిన విధంగా చికిత్స తీసుకుంటే హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version