తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టడమే కేంద్రంగా కుట్ర జరిగింది.. హైకోర్టు సిట్‌ లాయర్‌

-

మొయినాబాద్‌ ఫాంహౌస్‌ టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కొనుగోలు కేసుపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. అయితే.. ఇప్పటికే రామచంద్ర భారతి, నంద కుమార్‌, సింహయాజులు దగ్గర నుంచి రాబట్టి వివరాలు, వారి సెల్‌ఫోన్‌ డాటా ఆధారంగా పలువురుకి ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. అయితే.. తాజాగా ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రభుత్వం తరపున న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. కోర్టు భోజన విరామం అనంతరం ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది దవే వాదిస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తీవ్ర నేరమైన కేసు అని.. తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టడమే కేద్రంగా ఇందులో కుట్ర జరిగిందని తెలిపారు. భాజపాకు సంబంధం లేదంటూనే నిందితుల తరుపున పిటిషన్లు వేస్తున్నారని.. తప్పు చేయకపోతే విచారణకు సహకరించాలి కదా అని తెలిపారు. ఈ వ్యవహారంలో కేసు నమోదు అయిన మరుక్షణం నుంచే బలహీనం చేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.

గడచిన కొన్నేళ్లలో భాజపా అనేక ప్రభుత్వాలను పడగొట్టిందని… ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొని చార్టెడ్ ఫ్లైట్లలో తీసుకెళ్లి కూలదోశారని కోర్టు దృష్టికి తెచ్చారు. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవాలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. పార్టీ కానీ ప్రభుత్వం కానీ ప్రమాదంలో పడినప్పుడు పార్టీ అధినేతగా, సీఎంగా స్పందించే హక్కు ముఖ్యమంత్రికి ఉందని దవే తెలిపారు. సంఘటనపై జరిగిన విషయాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత సీఎంకి కచ్చితంగా ఉంటుందన్న న్యాయవాది… మీడియాకు కోర్టులకు ఆధారాలతో చూపించారని తెలిపారు. అంతకుముదు సిట్ దర్యాప్తును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ముగ్గురు నిందింతుల తరఫున ప్రముఖ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ వాదనలు వినిపించారు. కేసును కేవలం రాజకీయ కోణంలోనే నమోదు చేశారన్న జెఠ్మలానీ… దర్యాప్తు అధికారి నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిజాయతీగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కానీ ప్రస్తుతం దర్యాప్తు ఆ విధంగా జరగట్లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదని… రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్.. వారి కనుసన్నల్లోనే పని చేస్తోందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version