కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచం మొత్తం అతలాకుతలం అయింది. ఒక్కసారిగా ప్రపంచమంతా స్తంభించిపోయింది. కరోనా సోకిన రోగిన చూస్తే చాలు ప్రజలు భయపడిపోతున్నారు. వారికి ఆమడు దూరంలో ఉంటున్నారు. ఆఖరికి కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు చేసేందుకు కూడా ఎవరు ముందుకు రావట్లేదు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో చూశాం. ఆఖరికి ప్రజాప్రతినిధులు సైతం ఇదే భయంలో ఉన్నారు. అయితే తాజాగా పశ్చిమ బెంగాల్లో జరిగిన ఓ ఘటనతో మానవత్వం ఇంకా బతికేఉందని రుజువైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పశ్చిమ బెంగాల్లోని ఓ పల్లెటూరిలో 43 సంవత్సరాల అమల్ బారిక్ అనే వ్యక్తికి జ్వరం వచ్చింది. అయితే అది కరోనా వల్ల వచ్చిన జ్వరమని భావించి అందరూ భయంతో అతడిని దూరం పెట్టారు. కాని, అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన సత్యకామ్ పట్నాయక్ అనే యువకుడు మాత్రం వెంటనే తెలిసిన వారి వద్ద ఓ బైక్ అడిగి తీసుకుని.. ఆ తర్వాత మెడికల్ షాపునకు వెళ్లి అక్కడ పీపీఈ కిట్ కొనుగోలు చేశాడు. అనంతరం ఆ పీపీఈ కిట్ ధరించి అమల్ బారిక్ నివాసానికి వెళ్లాడు. అతడిని బండి మీద ఎక్కించుకుని 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రిలో చేర్చాడు. దీంతో అతను చేసిన ఈ సాహసాన్ని అందరూ అభినందిస్తున్నారు.