స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, కె. రాధాకృష్ణ నిర్మించారు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కాగా, నిన్న రాత్రి విశాఖ వేదికగా ‘అల వైకుంఠపురములో..’ సక్సెస్ మీట్ జరిగింది. ఈ సక్సెస్ మీట్‌లో మాట్లాడిన త్రివిక్రమ్.. విశాఖపట్నం పేరు చెప్పగానే, తనకు ఇక్కడ ఉండే ఆంధ్రా యూనివర్శిటీతో పాటు, అందమైన అమ్మాయిలు గుర్తుకు వస్తారని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
ఇక్కడి అమ్మాయిలు చాలా అందంగా ఉంటారని త్రివిక్రమ్ వ్యాఖ్యానించగానే, బన్నీ అభిమానులు, కార్యక్రమానికి వచ్చిన ప్రజలు కేరింతలు కొట్టారు. అలాగే ఇక్కడి బీచ్ తనకు ఎంతో ఇష్టమని, ఇక్కడే శ్రీశ్రీ తన మహాప్రస్థానం ప్రతులను పట్టుకుని రోడ్లపై తిరిగారని అన్నారు. చలం, రావిశాస్త్రి, సీతారామశాస్త్రి వంటి ఎందరో మహానుభావులను అందించిన వైజాగ్, ఎన్నో ఒంపులున్న మహానగరమని, ఈ నగరానికి తాను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కవితాత్మకంగా వైజాగ్ విశిష్టతను తెలిపారు. తాను ఇక్కడే చదువుకున్నానని, ఆనాటి జ్ఞాపకాలు తన మనసులో పదిలంగా ఉన్నాయని, తన భవిష్యత్తుకి బాటలు వేసిన విశాఖకు రుణపడివుంటానని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలిపారు.