ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్న చిత్రం “ఆదిపురుష్”. లేటెస్ట్గా రిలీజైన ఈ మూవీ ట్రైలర్.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారిపోయింది. మూవీ లవర్స్ మెజారిటీ డిస్కషన్.. ఈ సినిమా మీదనే నడుస్తోంది. కొందరు పాజిటివ్ కామెంట్ చేస్తుంటే.. మరికొందరు నెగెటివ్ రియాక్షన్ ఇస్తున్నారు. ఇంకొందరు కంపేరిజన్స్ చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా పొలిటికల్ లీడర్స్ కూడా ఎంటరయ్యారు. “బాయ్‌కాట్ ఆదిపురుష్” నినాదం అందుకున్నారు. ఈ నేపథ్యంలో.. సోషల్ మీడియాలో నడుస్తున్న ఒపీనియన్ ట్రెండ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
యానిమేటెడ్ మూవీనా..? : ట్రైలర్లో మెజారిటీగా వీఎఫ్ఎక్స్ వర్క్‌నే చూపించారు డైరెక్టర్ ఓం రౌత్. దీంతో.. ఇది రియల్ మూవీగా లేదని.. ఏదో యానిమేటెడ్ మూవీలాగా అనిపిస్తోందని కామెంట్ చేస్తున్నారు. వింత పక్షిపై రావణుడు ప్రయాణించడం.. వానరసైన్యం ఫైట్లు.. సముద్రం.. ఇలా ఏది చూసినా.. యానిమేటెడ్ విజువల్ అన్న విషయం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు.
రాముడికి మీసాలేంటి? : శ్రీరాముడి చిత్రపటాల్లోనూ.. దేవాలయాల్లోనూ మీసాలు కనిపించవు. రాముడికి మీసాలు ఉన్నట్టు ఇప్పటి వరకూ ఎవరూ ఎక్కడా చూడలేదు. వినలేదు. ఇప్పటి వరకూ వివిధ భాషల్లో తెరకెక్కిని ఏ సినిమాలోనూ.. శ్రీరాముడి పాత్రధారుడికి మీసాలు లేవు. మరి, ఇప్పుడు ఆదిపురుష్‌లో ప్రభాస్ కు మీసాలు పెట్టడమేంటి? అనే విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు.
బాహుబలి చిత్రంలో జలపాతాలు.. యుద్ధ సన్నివేశాలు.. వంటివన్నీ వీఎఫ్ఎక్స్, సీజీ టెక్నాలజీతో రూపొందించినవే. కానీ.. అందులో ఏ ఒక్క సన్నివేశం కూడా గ్రాఫిక్స్ లాగా అనిపించదు. కానీ.. ఆదిపురుష్ ట్రైలర్ చూసిన వారెవరికైనా.. కంప్యూటర్ మేనిఫ్యాక్చర్ మూవీ అని అర్థమవుతోందని కామెంట్ చేస్తున్నారు.
“ఆదిపురుష్” టీజర్ చూసిన తర్వాత.. చాలా మంది ఈ చిత్రాన్ని రజనీకాంత్ “కొచ్చాడియన్” చిత్రంతో కంపేర్ చేస్తున్నారు. రజనీ కూతురు సౌందర్య ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం 2014లో విడుదలైంది. అప్పట్లోనే.. ఈ చిత్రానికి దాదాపు 125 కోట్లు ఖర్చు చేసినట్టు అంచనా. కానీ.. రజనీకాంత్‌ను ఓ యానిమేటెడ్ బొమ్మలా చూడలేకపోయారు ఫ్యాన్స్. సగటు ఆడియన్స్ కూడా ఇదే ఫీలయ్యారు. ఆ కారణంగా.. సినిమా భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఇప్పుడు.. ఆదిపురుష్ టీజర్ చూసిన తర్వాత.. అదే సినిమా గుర్తుకు వస్తోందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పటి వరకూ ఫ్యాన్స్, మూవీ లవర్స్ మాత్రమే ఒపీనియన్స్ షేర్ చేస్తుండగా.. రాజకీయ పార్టీలు సైతం రంగంలోకి దిగుతున్నాయి. తాజాగా.. భాజపా అధికార ప్రతినిధి మాళవిక అవినాశ్ స్పందించారు. “లంకకు చెందిన ఒక శివ-భక్త బ్రాహ్మణుడైన రావణుడు 64 కళలలో ప్రావీణ్యం సంపాదించాడు! వైకుంఠపాలకులైన జయ విజయల శాపం కారణంగా రావణుడిగా అవతరించాడు! అయితే.. “ఆదిపురుష్”లోని రావణుడు.. టర్కిష్ నిరంకుశుడిలా ఉన్నాడు! మన రామాయణం/చరిత్రను తప్పుగా చూపించడం ఆపండి! లెజెండ్ ఎన్టీ రామారావు గురించి ఎప్పుడైనా విన్నారా?” అంటూ ట్వీట్ చేశారు.
తాజాగా.. మహారాష్ట్ర మంత్రి మిశ్రా స్పందించారు. బ్రాహ్మడైన రావణుడిని దారుణంగా చూపించారని మండిపడ్డారు. ఆ పాత్రధారి సైఫ్ అలీఖాన్.. అల్లావుద్దీన్ ఖిల్జీ, బాబర్, ఔరంగజేబులా ఉన్నాడని.. హనుమంతుడికి తోలు దుస్తులు (లెదర్) తొడిగారని, ఫైర్ అయ్యారు. ఆదిపురుష్ టీజర్ హిందువులకు వ్యతిరేకంగా ఉందని, సినిమాలోని కొన్ని సన్నివేశాలు తొలగించాలని దర్శకుడికి లేఖరాసినట్టు చెప్పారు. ఇలా.. “ఆదిపురుష్” టీజర్ పై మిక్స్డ్ టాక్ నడుస్తోంది. మరి, సినిమా ఎలా ఉండబోతోంది? నెగెటివ్ కామెంట్లకు చెక్ పెడుతుందా? మరిన్ని కామెంట్స్‌కు ఛాన్స్ ఇస్తుందా?? అన్నది చూడాలి.