తెలంగాణా మున్సిపల్ ఎన్నికల్లో తెరాస పూర్తిగా ఆధిపత్యం కొనసాగించింది. ఎక్కడా కూడా విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా తెరాస పూర్తి స్థాయిలో విజయం సాధించింది. ఇప్పటి వరకు వెలువడన ఫలితాల్లో వందకు పైగా మున్సిపాలిటీలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ నాలుగు, బిజెపి ఒకటి, ఇతరులు రెండు స్థానాలకు పరిమితం అయ్యారు. దాదాపు అన్ని జిల్లాల్లో తెరాస క్లీన్ స్వీప్ చేసింది.
కాంగ్రెస్ పార్టీ ఉద్దండుల సొంత నియోజకవర్గాల్లో కూడా తెరాస సత్తా చాటింది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాల్లో కారు జోరుకి విపక్షాలు కుదేలు అయిపోయాయి. మహబూబ్ నగర్ జిల్లాలో బిజెపికి గాని కాంగ్రెస్ కి గాని అవకాశం ఇవ్వలేదు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి తెరాస ఊహించని షాక్ ఇచ్చింది. ఆయన సొంత నియోజకవర్గం అయిన కోడంగల్ మున్సిపాలిటీని తెరాస కైవసం చేసుకుంది.
కోడంగల్ రేవంత్ సొంత నియోజకవర్గం. ఆయనకు అక్కడ పూర్తి పట్టునది. అయినా సరే తెరాస వ్యూహాల ముందు రేవంత్ తేలిపోయారు. మెజారిటి వార్డుల్లో తెరాస విజయం సాధించింది. కాంగ్రెస్ కి పట్టున్న వార్డుల్లో కూడా తెరాస వ్యూహాలు పని చేసాయి. ఇక పరకాల మున్సిపాలిటిని కూడా తెరాస గెలుచుకోవడంతో కొండా దంపతులకు ఒక్కసారిగా ఊహించని షాక్ తగిలింది.