కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గాను తెలంగాణా ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నారు అక్కడి రాజకీయ నాయకులు. కరోనా వైరస్ ని ఏ విధంగా అయినా కట్టడి చెయ్యాలని భావిస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీగా విరాళాలు అందిస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా తమ వంతుగా 500 కోట్ల భారీ విరాళం ప్రకటించారు.
తమ వంతు సహాయంగా ఒక నెల వేతనం సహా ఒక ఏడాది నియోజకవర్గ అభివృద్ధి నిధులు మొత్తం కలిసి దాదాపు రూ. 500 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో ఎంపికి ఏడాదికి ఐదు కోట్ల రూపాయలు తమ నియోజకవర్గ అభివృద్ది కోసం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. తెరాస పార్టీకి 16 మంది ఎంపీలు ఉన్నారు. వీరు అందరికి కూడా 80 కోట్ల నిధులు వస్తాయి.
వాటి మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్దమయ్యారు. తెరాస పార్టీ పార్లమెంటరీ పక్ష నేత కేకే, ఉప నాయకుడు బండ ప్రకాశ్, లోకసభలో పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు, ఉప నాయకుడు కొత్త ప్రభాకర్ రెడ్డి బుధవారం ప్రగతి భవన్‌లో ఇందుకు సంబంధించిన కాన్సెంట్ లెటర్ ను అందించారు. అలాగే ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు 3 కోట్లు వస్తాయి. వాటిని కూడా ఇవ్వడానికి సిద్దమయ్యారు. వీరిని ముఖ్యమంత్రి కెసిఆర్ అభినందించారు.