గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యధిక డివిజన్లు గెలుచుకున్న పార్టీ టీఆర్‌ఎస్. సొంతంగా మేయర్ పీఠం అధిష్టించే సంఖ్యా బలానికి కొద్ది దూరంలో ఆగిపోయింది. అయితే టీఆర్‌ఎస్ నుంచి గ్రేటర్ మేయర్ పీఠం అధిష్టించే ఆ లక్కీలేడీ ఎవరు? జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో.. రేస్‌లో వినిపిస్తున్నవారి పేర్లలో ఒకరు ఫైనల్ అవుతారా..కొత్త వారు తెరపైకి వస్తారా అధికారపార్టీలో దీనిపై ఆసక్తికర చర్చ నడుస్తుంది.
ఒకవైపు టీఆర్‌ఎస్ పెద్దలు రాజకీయ ఎత్తుగడలపై తలమునకలై ఉంటే.. మరోవైపు పార్టీలో కాబోయే మేయర్‌పై చర్చ జరుగుతోంది. అందుబాటులో ఉన్న రాజకీయ సమీకరణాలపై గులాబీ దళం దృష్టి పెట్టారు. 2016లో 99 స్థానాల్లో గెలుపొందడంతో ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. ఈసారి గ్రేటర్ హైదరాబాద్ మేయర్ సీటు జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. పైగా సగం డివిజన్లు లేడీస్‌కే రిజర్వ్ చేయడంతో ఎన్నికైన వారిలో వారి సంఖ్యే ఎక్కువ. అయితే అధికార పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందన్నది ఆసక్తిగా మారింది.
ఇప్పటికే కొందరి పేర్లు చర్చలోకి వస్తున్నాయి. రేస్‌లో మరికొందరు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రెడ్డి సామాజికవర్గం నుంచి మేయర్‌ను ఎంపిక చేస్తారా? లేక బీసీ సామాజికవర్గం నుంచి మేయర్‌ను ఎన్నుకుంటారా అన్నది పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. భారతీనగర్ డివిజన్ నుంచి రెండోసారి కార్పొరేటర్‌గా గెలిచిన సింధు ఆదర్శ్‌రెడ్డి పేరు మేయర్ రేస్‌లో ప్రముఖంగా వినిపిస్తోంది. ఖైరతాబాద్ డివిజన్ నుంచి మరోసారి ఎన్నికైన విజయారెడ్డి పేరు కూడా చర్చ జరుగుతోంది. వెంకటేశ్వర్ కాలనీ నుంచి గెలిచిన మన్నె కవితారెడ్డికి కూడా అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఒకవేళ సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం కొత్తవారిని పార్టీ ఎంపిక చేయొచ్చనే వాదన కూడా ఉంది. అదే జరిగితే బీసీ సామాజికవర్గం నుంచి మేయర్‌గా అవకాశం కల్పిస్తారని అభిప్రాయపడుతున్నారు. టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి పేరు పరిగణనలోకి తీసుకుంటారని అనుకుంటున్నారు. అలాగే చర్లపల్లి నుంచి గెలిచిన మేయర్ బొంతు రామ్మోహన్‌రావు భార్య శ్రీదేవి పేరును కూడా పరిశీలించవచ్చని సమాచారం. హఫీజ్‌పేట్ నుంచి రెండోసారి గెలిచిన పూజిత కూడా రేస్‌లో ఉన్నట్టు చెబుతున్నారు.
ప్రస్తుతం మేయర్ అంశంపై పార్టీలో పైకి చర్చ జరగకపోయినా.. అంతర్గతంగా టీఆర్‌ఎస్ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారని సమాచారం. అయితే ఆ పేరు ఎంటో… మేయర్ కాబోయే ఆ మహిళా కార్పొరేటర్ ఎవరో బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారట. గ్రేటర్ లో రాజకీయ సమీకరణాలు కొలిక్కి వచ్చిన తర్వాతే ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. మరి.. మేయర్ పీఠంపై కూర్చునే భాగ్యం ఎవరికి దక్కుతుందో చూడాలి.