జోరు మీదున్న కారు.. హుజురాబాద్‌లో అధికార పార్టీదే విజయం..!

-

హుజురాబాద్ ఉప ఎన్నిక( Huzurabad By Election )లో టీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమైనట్లు ఆ పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు ‘దళిత బంధు’ ఇతర కార్యక్రమాలు ఉపయోగపడుతాయని గులాబీ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు నియోజకవర్గంలో మొన్నటి వరకు జోరుగా తిరిగిన ఈటల రాజేందర్ ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ‘దళిత బంధు’ ముహుర్తం ఖరారు చేయడంతో పాటు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. పెన్షన్ల మంజూరు, గొర్రెల పంపిణీ వంటి ఇతర విషయాలు అధికార పార్టీని గట్టెక్కిస్తాయని అంచనా వేస్తున్నారు ఆ పార్టీ నేతలు.

TRS-Party | టీఆర్ఎస్

నియోజకవర్గంలో గులాబీ పార్టీ సమీకరణాలను కూడా పాటిస్తున్నట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆయన పలుకుబడి నియోజకవర్గంలో పని చేస్తుందని, తద్వారా గులాబీ పార్టీకి ఓట్లు వస్తాయని అంచనా కడుతున్నారు. ఇక బీజేపీకి రాజీనామా చేసిన మోత్కుపల్లి నర్సింహులు బహింరంగంగా టీఆర్ఎస్‌కే మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలోనే బలమైన బీసీ అభ్యర్థికి టీఆర్ఎస్ టికెట్ ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

జిల్లాలో పట్టున్న బీసీ నేతలు కూడా టీఆర్ఎస్‌లోనే ఉండటం వారికి అడ్వాంటేజ్ కావొచ్చు. బలమైన బీసీ నేతగా, చేనేత సామాజిక వర్గం నుంచి మంచి పేరున్న ఎల్.రమణ, పారిశ్రామిక వేత్త స్వర్గం రవి, వారి అనుచరులు ఇటీవల పింక్ పార్టీలో చేరారు. వీరి ప్రచారం ద్వారా టీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్‌లో బాగా పుంజుకుంటుందని, తద్వారా ఈటల రాజేందర్‌ను చాలా ఈజీగా ఉప ఎన్నికలో ఓడించొచ్చని భావిస్తున్నారు. అయితే, హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు అనేది ఇప్పటి వరకు ఇంకా తేలలేదు. ఈ విషయమై అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా జోరు మీదున్న కారుకు బ్రేక్‌లు వేసేందుకు కమలనాథులు ఎలాంటి వ్యూహాలు రచిస్తారో చూడాలి మరి..

ఇనుగాల పెద్దిరెడ్డి, పొనగంటి మల్లయ్య, వకుళాభరణం కృష్ణమోహన్, కనుమల్ల విజయ, గెల్లు శ్రీనివాస్ యాదవ్, స్వర్గం రవి పేర్లు టీఆర్ఎస్ హుజురాబాద్ అభ్యర్థిగా పెట్టేందుకు పరిశీలనలో ఉన్నాయి. ఈ విషయమై అధిష్టానం నిర్ణయమే ఫైనల్‌గా ఉండబోతుంది. మొత్తంగా మొన్నటి వరకు హుజురాబాద్ రాజకీయం ఒక రకంగా ఉండగా ప్రస్తుతం అధికార పార్టీ గెలుపు వైపే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తున్నదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version