గులాబీ పార్టీలో గొప్పోళ్ళు: తెలంగాణని ప్రత్యేక దేశం చేస్తారా?

-

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ నేతలు ఏం చేసిన, ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనే భ్రమలో ఉన్నట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉన్నాం కదా.. తాము చేసిందే వేదం అనుకుంటున్నారు. అలాగే ఏం చేసిన ప్రజలు కూడా ఆమోదిస్తారని భావిస్తున్నారు. అందుకే గులాబీ నేతలు హద్దులు దాటేసి మాట్లాడేస్తున్నారు. అది ఎంతవరకు అంటే తెలంగాణని ప్రత్యేక దేశం చేసే స్థాయి వరకు.

TRS-Party | టీఆర్ఎస్

ఎలాగో పొరాడి ఆంధ్రా నుంచి తెలంగాణని విడగొట్టుకున్నారు. నీళ్లు నిధులు నియ‌మ‌కాల పేరుతో స‌బ్బండ వ‌ర్ణాలు ఐక్యంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పొరాడి సాధించారు. ఇక అందరూ అనుకున్నట్లే ప్రత్యేక రాష్ట్రం వచ్చింది.. ఇక తెలంగాణ సాధించిన నాయకుడుగా కేసీఆర్… తెలంగాణకు తొలి సీఎంగా గద్దెని ఎక్కారు. రెండోసారి కూడా ఆయనే సీఎం సీటులో కూర్చున్నారు. మరి రెండు సార్లు సీఎం అయిన కేసీఆర్… గ‌డిచిన ఏడేళ్ళ‌లో తెలంగాణ అభివృద్ధి ప‌థంలో దూసుకుపోతోంద‌ని టీఆర్ఎస్ నాయ‌కులు చెబుతుండ‌గా, ధ‌నికి రాష్ట్రంగా ఉన్న తెలంగాణ‌ను అప్పుల తెలంగాణగా మార్చారంటూ ప్ర‌తిప‌క్షాలు ఇంతెత్తున లేస్తున్నాయి.

ఇక దేశానికి తెలంగాణ బువ్వ‌పెడుతుందంటూ కొంద‌రు నాయ‌కులు, మ‌రికొంద‌రు దేశాన్ని పోషిస్తున్నామంటూ ప్ర‌సంగాలు చేస్తున్నారు. ఇక మ‌రి కొంద‌రు గులాబీ నేతలు స్వామి భక్తి ప్రదర్శిస్తూ….తెలంగాణని భారతదేశం నుంచి విడగొట్టి సెపరేట్ దేశంగా చేస్తే కేసీఆర్ ప్రధాని అవుతారని మాట్లాడుతున్నారు. అంద‌రినీ ఆదుకుంటాడంటూ భ‌జ‌న మొద‌లు పెట్టారు.

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై పోరాటం చేస్తున్న గులాబీ పార్టీ… తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వేములవాడ నియోజకవర్గంలో టీఆర్ఎస్ జెడ్పీటీసీ నాగం భూమయ్య.. ఆంధ్రా నుండి తెలంగాణను ఎలా విభజించారో భారతదేశం నుండి తెలంగాణను అలా విభజించాలని పెద్ద మైకేసుకుని ప్రజలందరి ముందు డిమాండ్ చేశారు. అయితే ఇలా సెపరేట్ దేశం చేయాలని మాట్లాడ‌టం ఏంటి..? పోరాడి గెలిచిన తెలంగాణ అంటే అంద‌రికీ గౌర‌వం, ప్రేమ ఉంటుంది అది పార్టీల‌క‌తీతంగా అని చెప్పొచ్చు.. కానీ దేశం కంటే ఏ రాష్ట్ర‌మూ గొప్ప‌ది కాదు. రాష్ట్రం దేశంలో భాగం. ఏది ప‌డితే అది మాట్లాడుతూ పార్టీకి మ‌చ్చ తెస్తున్నారు. ఏదో తమ మాట చెల్లుబాటు అవుతుందని ఎలా పడితే అలా మాట్లాడితే ప్రజలు తిరస్కరించే రోజులు దగ్గరపడ్డట్టే.

గ‌తంలో బొందుగాళ్లు అనే కామెంట్ ఎంత డామేజ్ చేసిందో మ‌రిచిపోయి ఉంటారు. మ‌రో ఉప ఎన్నిక రాబోతుందా అంటే అవున‌నే స‌మాధానాలు విన‌వ‌స్తున్నాయి. వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రమేష్‌కు దేశ పౌరసత్వమే లేదు..ఆయన కేసు ఇప్పుడు కోర్టులో ఉంది…రేపోమాపో వ్యతిరేకంగా తీర్పు వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందే. ప్ర‌త్యేక తెలంగాణ దేశం కామెంట్స్ కూడా టీఆర్ఎస్‌కి చిక్కులు తెచ్చేలా క‌నిపిస్తున్నాయి.

మొత్తానికైతే గులాబీ పార్టీలో గొప్పోళ్లే ఉన్నారని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version