కారు స్పీడ్‌కు కాంగ్రెస్ కంచుకోట బద్దలైంది. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచీ ఉమ్మడి నల్లగొండ జిల్లా కంచుకోటగా ఉంటోంది. ఎక్కడ పార్టీ ఓడిపోయినా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాత్రం హస్తం పార్టీ హవా నడుస్తుంది. కానీ.. 2018 ముందస్తు ఎన్నికల్లో ఆ పార్టీకి ఊహించని దెబ్బపడింది. అధికార టీఆర్ఎస్ పార్టీ స్పీడ్‌కు ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు ఓటమిపాలయ్యారు. తాజాగా జరిగిన హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడంతో.. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందనే టాక్ మొదలైంది.
నిజానికి.. 2018 ఎన్నికల్లో కోదాడ నుంచి పద్మావతిరెడ్డి, హుజూర్‌నగర్ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బరిలో నిలిచారు. అయితే.. కోదాడలో కొద్దిపాటి తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో పద్మావతిరెడ్డి ఓడిపోయారు. ఇదే సమయంలో హుజూర్‌నగర్‌లో స్వల్పమెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గెలిచారు. దీంతో హుజూర్‌నగర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఇక్కడ ఉత్తమ్ తన భార్య పద్మావతిరెడ్డిని బరిలో నిలిపారు.
ఇదే సమయంలో సైదిరెడ్డికే మళ్లీ సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారు. ఉప ఎన్నిక ఫలితాల్లో మొదటి రౌండ్ నుంచే సైదిరెడ్డి ఆధిక్యం ప్రదర్శించారు. మొత్తం 43 వేల ఓట్ల భారీ మెజార్టీతో సైదిరెడ్డి ఘనవిజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులతో పాటు ఉత్తమ్‌కు సైతం పెద్ద షాక్ తగిలింది. హుజూర్‌నగర్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పని అయిపోయిందని గులాబీ శ్రేణులు అంటున్నాయి. దీంతో ముందుముందు పరిస్థితులు మరింత దయనీయంగా ఉంటాయని కాంగ్రెస్ శ్రేణులే అంటుండడం గమనార్హం.
ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మునుగోడులోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు. ఆయనకూడా నిత్యం పార్టీపై అసంతృప్తి వెల్లగక్కుతున్నారు. మరోవైపు నల్లగొండ ఎంపీగా ఉత్తమ్, భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నారు. అయితే.. అంతర్గత కుమ్ములాటలే పార్టీ ఓటమికి కారణమని పలువురు నాయకులు అంటున్నారు. హుజూర్‌నగర్ ఉపఎన్నికల కౌంటింగ్ పూర్తిగాక మునుపే కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది.
ఇప్పటి వరకూ ఓ లెక్క.. ఇకపై ఓ లెక్క అన్నట్లుగా టీఆర్ఎస్ నేతలు జోరు పెంచి మరీ విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. ఈ ఎన్నికతో తెలంగాణలో ఇక కాంగ్రెస్ పని అయిపోయిందంటూ టీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోంది. కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాలను రచిస్తుందో చూడాలి మరి.