ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యర్థిని ఫిక్స్ చేసుకునే పనిలో టీఆర్‌ఎస్‌

-

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సందర్భంగా తెలంగాణలో రాజకీయ పార్టీలు గేర్‌ మార్చాయి. ప్రచారంతోపాటు రాజకీయ విమర్శలపై ఫోకస్‌ పెట్టాయి. ఈ విషయంలో అధికారపార్టీ టీఆర్‌ఎస్‌ ఎత్తుగడ ఏంటి? ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పోటీ ఎవరు? ఎవరిని లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు పేల్చుతుంది? అన్నది ఆసక్తిగా మారింది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ దూకుడుగా వెళ్లడంతో ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ స్ట్రాటజీ పై ఉత్కంఠ రేపుతుంది.


హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణిని బరిలో దించింది టీఆర్‌ఎస్‌. ఇది బీజేపీ సిట్టింగ్‌ స్థానం. ఇక్కడ కమలానికి చెక్‌పెట్టి గులాబీ జెండా ఎగరేయాలన్నది అధికారపార్టీ ఆలోచన. ఎమ్మెల్సీగా ఉన్న రామచంద్రరావుతోపాటు… కేంద్రం తెలంగాణకు ఏం చేయాలేదని విమర్శిస్తోంది. 15 లక్షల నగదు.. ఉద్యోగాల భర్తీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు. ఏతావాతా ఉద్యోగాల భర్తీపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టింది గులాబీ దండు.

నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు. ఈ సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవాలన్నది టీఆర్‌ఎస్‌ ఆలోచన. ఇక్కడ విమర్శలకంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారంలో వెల్లడిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందీ వివరిస్తున్నారు నాయకులు. పనిలో పనిగా బీజేపీని లక్ష్యంగా చేసుకుని వేడి పెంచుతున్నారు. విభజన చట్టంలో ప్రస్తావించిన హామీల అమలుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అధికార పార్టీ నేతలు.

రాబోయే నాగార్జునసాగర్‌ ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌నూ వదలడం లేదు టీఆర్‌ఎస్‌. ఒక చోట మాజీ మంత్రి చిన్నారెడ్డి, మరోస్థానంలో మాజీ ఎమ్మెల్సీ రాములనాయక్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులుగా బరిలో ఉండటంతో అందుకు తగ్గట్టుగానే ఎన్నికల రణతంత్రం రచిస్తోంది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ నియోజకవర్గంలో ఉద్యమకారులు సైతం పెద్దసంఖ్యలో బరిలో ఉన్నారు. ప్రశ్నించే గొంతుకలమంటూ ప్రచారం చేస్తున్నారు. వీరందరికీ ఒకటే సమాధానంగా అభివృద్ధి మంత్రాన్ని వల్లె వేస్తున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు. మరి..ఈ స్ట్రాటజీ అధికార పార్టీకి ఏ మేరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version