ఉప్పల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

-

హైదరాబాద్: ఉప్పల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్లిన ఆయన లిఫ్ట్‌లో చిక్కుకున్నారు. మొదటి అంతస్తులో కార్యక్రమం ముగించుకొని రెండో అంతస్తుకు వెళ్తుండగా లిఫ్ట్‌ కదిలినట్లే కదిలి ఒక్కసారిగా గ్రౌండ్‌ ఫ్లోర్‌లో పడిపోయింది. అయితే లిఫ్ట్ ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఎమ్మెల్యే గన్‌మెన్‌లు వెంటనే లిఫ్ట్‌ ద్వారాన్ని తెరవడంతో వారంతా సురక్షితంగా బయటకు వచ్చారు. ప్రమాదం తప్పడంతో ఎమ్మెల్యేతో పాటు ఉన్న బోడుప్పల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ సామల బుచ్చిరెడ్డి, మరో ఏడుగురు ఊపిరి పీల్చుకున్నారు. ఓవర్‌ లోడ్‌తోనే ఈ ప్రమాదం జరిగిందని అంచనా వేశారు.

అయితే ఈ ఘటన గురువారం మధ్యహ్నం జరిగింది. ఈ ఘటనలో తనకు ఎలాంటి గాయాలు కాలేదని ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి తెలిపారు. తనతో పాటు వచ్చిన వారుకూడా సురక్షితంగా ఉన్నారని, వారికి కూడా ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు. ఒక్కోసారి అనుకోకుండా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని, అప్రమత్తంగా ఉంటే సురక్షితంగా బయట పడొచ్చని సుభాష్ రెడ్డి తెలిపారు. ఇందులో బిల్డింగ్ సిబ్బంది నిర్లక్ష్యం లేదని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version