అమెరికా చరిత్రలో అత్యంత చెత్త ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అని చెప్పడానికి ఎలాంటి సందేహాలూ అక్కర్లేదు. అధ్యక్షుడే తన దేశ పార్లమెంట్ పై దాడి చేయించిన దారుణం.. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను డివైడెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చేసినంత పనిచేశాడు ట్రంప్.
ఎప్పుడో శతాబ్దాల క్రితం మరుగునపడ్డ జాతి వివక్షను రెచ్చగొట్టి.. వైట్స్, బ్లాక్స్ మధ్య విభజన మంటలు రేపిన ట్రంప్.. అధికారం కోసం అమెరికాలో అంతర్యుద్ధానికే పూనుకున్నాడు. కాస్తలో తప్పిపోయింది కానీ.. లేకపోతే క్యాపిటల్ హిల్ పై దాడి జరిగిన రోజు.. ఎలాంటి దారుణాలు జరిగి ఉండేవోనని ఆ ఘటన గుర్తొచ్చినప్పుడల్లా సెనేటర్లు ఇప్పటికీ వణికిపోతున్నారు. ట్రంప్ ఎలాంటివాడనే విషయం పక్కనపెడితే.. అసలు ఇలాంటివాడ్ని అమెరికా ఎలా ప్రెసిడెంట్ గా ఎన్నుకుందని ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది.
ఓ రకంగా అమెరికా రాజ్యాంగ మౌలిక సూత్రాల్లోనూ వలసవాదం ఉంది. ఓ దశలో వలసలపై నిషేధం విధించాలన్న ప్రతిపాదనలు కాంగ్రెస్ కి ముందుకు వచ్చినా అవి వీగిపోయాయి. ఇలాంటి వలసవిధానాన్ని ట్రంప్ సమూలంగా మార్చేశారు. ఏకంగా అమెరికా ఆత్మమీదే దెబ్బకొట్టే సాహసం చేశారు. ముస్లిం దేశాల నుంచి వచ్చేవచారిపై ఉగ్రవాదం బూచి చూపి ఆంక్షలు విధించడం దగ్గర్నుంచి.. అమెరికన్ల ఉద్యోగాలు లాగేసుకుంటున్నారనే సాకుతో హెచ్ వన్ బీ వీసాలపై కఠిన ఆంక్షల వరకు.. ట్రంప్ దుందుడుకుతనానికి.. అమెరికాతో పాటు ప్రపంచ దేశాలన్నీ అవాక్కయ్యాయి.
అమెరికన్లలో ఎప్పుడూ లేని విధంగా ఇతర దేశాల వారిపై ద్వేషాన్ని పెంచి పోషించి.. దాడులకు దిగేలా చేయడం కూడా ట్రంప్ జమానాలోనే జరిగింది. అవకాశాల స్వర్గంగా ఉన్న అమెరికాను ప్రత్యక్ష నరకంగా మార్చిన పైత్యపు చరిత్ర ట్రంప్ ది. అమెరికా అంటే ప్రపంచానికి పెదన్న. అంతర్జాతీయ దౌత్య వ్యవహారాల్లో యూఎస్ విధానం చాలా కీలకం. అమెరికా ఏం చెబుతుందనే విషయం.. చాలా దేశాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అలాంటి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎడాపెడా తీసుకున్న తెలివితక్కువ నిర్ణయాలు.. అమెరికా అగ్రరాజ్యం హోదానే ప్రశ్నార్థకం చేశాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి తప్పుకోవడం, ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి బయటకు రావడం, ఇరాన్ తో న్యూక్లియార్ డీల్ల రద్దు లాంటి నిర్ణయాలు.. అమెరికా పరువు తీశాయి. అమెరికా ఉంటే ఉన్న నమ్మకాన్ని పటాపంచలు చేశాయి. శతాబ్దాలుగా అమెరికా కాపాడుకుంటూ వస్తున్న గౌరవం.. ట్రంప్ పుణ్యమా అని గంగ పాలైంది.
తమది పరిణతి చెందిన ప్రజాస్వామ్యమని గొప్పలు చెప్పుకునే అమెరికన్లు.. ఇలాంటి అధ్యక్షుడ్ని ఎన్నుకోవడమేంటనే చర్చ జరిగింది. ట్రంప్ సృష్టించిన జాతీయవాద మత్తులో పడిపోయిన అమెరికన్లు.. ఏదో పూనకం వచ్చినట్టుగా ఓట్లేసి ట్రంప్ ను గెలిపించారని విశ్లేషణలు నడిచాయి. మొత్తానికి అప్రజాస్వామిక విధానాలే ట్రంప్ కొంప ముంచాయి.