హెచ్​1బీ వీసాల్లో మోసాలను అరికట్టేందుకు ట్రంప్ కొత్త చర్యలు..!

-

హెచ్​1బీ సహా ఉద్యోగ ఆధారిత వీసా విధానాల్లో మోసాలు, దుర్వినియోగాన్ని నివారించేలా ట్రంప్ ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుందని చట్టసభ సభ్యుల ముందు అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సేవల(యూఎస్​సీఐఎస్) అధికారి వెల్లడించారు. కాంగ్రెస్​(అమెరికా చట్టసభ)లోని హౌజ్ జుడీషియరీ సబ్​కమిటీ విచారణ సందర్భంగా యూఎస్​సీఐఎస్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పాలసీ జోసెఫ్ ఎడ్లో ఈ మేరకు వివరణ ఇచ్చారు.

trump
trump

అమెరికాలోని కార్మికులు, వ్యాపారాల ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించే నియమాలు, విధానాలు, కార్యాచరణ మార్పులను.. యూఎస్​సీఐఎస్ అమలు చేసిందని చెప్పారు ఎడ్లో. హెచ్​1బీ పిటిషనర్లు చెల్లించే ఫీజును అమెరికాలోని కార్మికుల శిక్షణకు ఉపయోగించేలా చూడటం, ఎల్​1 పిటిషన్ల కోసం మార్గదర్శకాలను స్పష్టంగా విశదీకరించడం వంటి నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.

అమెరికా విద్యా సంస్థల నుంచి మాస్టర్స్​ లేదా అంతకన్నా ఎక్కువ హోదా డిగ్రీ సంపాదించిన వారికి హెచ్​1బీ ఎంపిక ప్రక్రియలో వీసా అవకాశాలు పెంచడానికి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు జోసెఫ్ ఎడ్లో. ఉద్యోగాల విషయంలో యజమానుల మోసాలను గుర్తించి అరికట్టే విధంగా న్యాయ శాఖతో సమన్వయాన్ని పెంపొందించుకున్నట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news