ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఆధారంగా.. బాధ్యులపై బదిలీ వేటు వేసింది.
రంగారెడ్డి డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి, డీసీహెచ్ఎస్ ఝాన్సీ లక్ష్మిపై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. వీరితో పాటు మొత్తం 13 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆపరేషన్లు చేసిన డాక్టర్ జోయల్ సునీల్ కుమార్‌పై క్రిమినల్ కేసు పెట్టగా.. బాధ్యులపై చర్యలతో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మార్గదర్శకాలు జారీ చేసింది. ఆగస్టు 25న ఇబ్రహీంపట్నంలో 34 మంది మహిళలకు కు.ని. ఆపరేషన్‌లు చేయగా.. శస్త్రచికిత్స వికటించి నలుగురు మహిళలు మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు, ప్రజలు, బాధితుల కుటుంబ సభ్యులు ఉవ్వెత్తున ఆందోళనలకు దిగారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించాలని ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే తాజాగా చర్యలు చేపట్టింది.