భక్తులకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త చెప్పింది. రథసప్తమి సందర్భంగా ఈ నెల 28న రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతామని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌తో సహా జిల్లా కేంద్రాల నుంచి వేములవాడ, ధర్మపురి, యాదగిరిగుట్ట, మన్యంకొండ, గూడెంలోని పుణ్యక్షేత్రాలకు ఈ ప్రత్యేక బస్సులు ఉంటాయని వివరించారు.
‘కరీంనగర్ నుంచి వేములవాడ, ధర్మపురికి 10 చొప్పున, నల్గొండ నుంచి యాదగిరిగుట్టకు 10, మహబూబ్‌నగర్ నుంచి మన్యంకొండకు 10, ఆదిలాబాద్ నుంచి గూడేనికి 5, హైదరాబాద్ కేపీహెచ్‌బీ నుంచి అనంతగిరికి 5 బస్సులు నడుపుతాం. జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి, చిలుకూరు బాలాజీ మందిరం, సికింద్రాబాద్ మహంకాళి, హిమాయత్‌నగర్ బాలాజీ తదితర ఆలయాలకు ప్రధాన ప్రాంతాల నుంచి 20 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నాం’ అని తెలిపారు.