ఆర్టీసీ సమ్మె – మిగిలింది బేషరతు విరమణేనా?

-

హఠాత్తుగా హైకోర్టు చేతులెత్తేయడం అందరినీ షాక్‌కు గురిచేసింది. లేబర్‌ కోర్డుకు బదలాయించడంల ద్వారా కేసు విచారణ ముగించిన కోర్టు, ఇక ముఖ్యమంత్రి దయేనని చెప్పకనే చెప్పినట్లయింది.

 

44రోజుల సమ్మె, దాదాపు 40రోజుల విచారణ తర్వాత, ఇప్పుడు ఉన్నత న్యాయస్థానం ఆర్టీసీ సమ్మెపై తనేం చేయలేనని తప్పుకోవడం విచిత్రంగా ఉంది. నిన్నటిదాకా ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న కోర్టు, తెల్లవారేసరికి తీర్పు తిప్పేయడం ఏంటి? నిన్న చేసిన కామెంట్లు, చెప్పిన కారణాలు, హైకోర్టుకు విచారణ ప్రారంభించినప్పుడే తెలుసు. ఇవ్వాళ హఠాత్తుగా అవే కామెంట్లు మళ్లీ చేసి, కేసును కార్మిక న్యాయస్థానానికి బదిలీ చేయడం వెనుక ఉద్దేశ్యమేమిటి?

సమ్మె చట్ట విరుద్ధమా, కాదా.. అనే విషయం తేల్చడం ఇప్పుడు ప్రాధాన్యతాంశంగా మారింది. సయోధ్య అధికారిగా ఉన్న లేబర్‌ జాయింట్‌ కమిషనర్‌కు ఆ అధికారం లేదని, లేబర్‌ కోర్టుకు మాత్రమే ఉన్నదని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. పారిశ్రామిక వివాదాల చట్టం-1947, సెక్షన్‌ 12 ప్రకారం లేబర్‌ కమిషనర్‌కు సమ్మె చట్టవిరుద్ధమని నిర్ణయించే హక్కులేదని, అది కేవలం కార్మిక న్యాయస్థానానికే ఉందని తెలిపిన ధర్మాసనం, రెండు వారాల్లోగా ఈ విషయాన్ని లేబర్‌ కోర్టుకు నివేదించాలని, ఒకవేళ నివేదించలేకపోతే, ఎందుకు అలా జరిగిందో వివరణ కేసులోని అన్ని పక్షాలకు ఇవ్వాల్సిఉంటుందని ఆదేశించింది.

(పాఠకుల పరిశీలనార్ధం పారిశ్రామిక వివాదాల చట్టం – 1947 ప్రతిని కింద అందిస్తున్నాం)

ఇప్పుడిక విషయం లేబర్‌ కమీషనర్‌ ద్వారా లేబర్‌ కోర్టుకు చేరబోతోంది. కమిషనర్‌ ఎలాగూ నిర్ద్వందంగా సమ్మె చట్టవిరుద్ధమనే చెప్తాడు కాబట్టి, లేబర్‌ కోర్టు కూడా దానినే సమర్థించే అవకాశముంటుంది. సమ్మె చట్టవిరుద్ధమని రుజువయినప్పుడు, ఉద్యోగాలు తీసేయడంతో సహా ఏ నిర్ణయమైనా తీసుకునే విశేషాధికారాలు ప్రభుత్వానికి సంక్రమిస్తాయి. ఇక అప్పుడు మొత్తం ఆర్టీసీ భవితవ్యం ఒక్క కేసీఆర్‌పైనే ఆధారపడిఉంటుంది.

ప్రస్తుతం పారిశ్రామిక వివాదాల చట్టం-1947ను కూలంకషంగా పరిశీలిస్తున్న యూనియన్‌ నాయకులు, విపక్ష నేతలు ఏ నిర్ణయానికి రానున్నారో నేటి సాయంత్రం లోగా తెలుస్తుంది. కానీ, అది దాదాపుగా బేషరతు సమ్మె విరమణ అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయి. కనుచూపుమేరలో ఏ ఒక్క మార్గమూ కనబడటంలేదు. ఒక పక్క కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కూలీకి వెళుతున్నారు. పిల్లలు రోగాలతో చచ్చిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో యూనియన్‌ నాయకులకు కూడా వేరే ప్రత్యామ్నాయం లేదు. తెగేదాకా లాగొద్దని, సంబంధాలు మళ్లీ పుంజుకున్నాక, సమస్యల గురించి అప్పుడు ఆలోచిద్దామని కొంతమంది మంత్రులు కూడా సంకేతాలు పంపినట్లు తెలిసింది. అయితే బేషరతుగా సమ్కె విరమించినా, ఉద్యోగానికి అనుమతి లభిస్తుందా..లేదా.. అనేది కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకమే. ఇంచార్జి ఎండి సునీల్‌ శర్మ ఇప్పటికే రెండుసార్లు కోర్టులో సమ్మె విరమించినప్పటికీ విధుల్లోకి తీసుకోవడం కష్టమనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఆయన అభిప్రాయమంటే, అది ముఖ్యమంత్రి అభిప్రాయమని వేరే చెప్పక్కర్లేదు.

కాకపోతే, బేషరతు విరమణ తర్వాత కార్మికులను విధులకు తీసుకునే విషయంలో కేసీఆర్‌ సానుకూలంగానే ఉంటారని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, ఇతర నాయకులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. ఆయనకు కావాల్సింది సంఘాలను రద్దు చేయడం, వాటి నాయకులను బయటికి పంపడం, కొంత మేర రూట్లను ప్రయివేటీకరించడం. ప్రయివేటు పరిపాలనలా మార్చడం. అంటే, ఉద్యోగ భద్రత అనే ప్రశ్నే లేదు. సరిగ్గా పనిచేస్తే ఉంటారు. లేకపోతే పోతారు అనే తరహా. సింపుల్‌గా చెప్పాలంటే ఒక మామూలు ప్రయివేటు ఉద్యోగంలా అన్నమాట. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగుల్లా పరిగణించాలనే అలోచన ముఖ్యమంత్రికి అస్సలు లేదు. కారణమేదయినా, సంఘాల నాయకుల మీద ఆయనకున్న కోసం కాస్తా కార్మికుల మెడకు చుట్టుకుంది. ఇప్పుడున్న ఏకైక సయోధ్య మార్గం కేవలం సమ్మె విరమణే.

నాయకులు, కార్మికులు బెట్టు వీడి, పంతం వదిలేసి సమ్మెను బేషరతుగా విరమిస్తున్నట్లు ప్రకటిస్తే, అప్పుడు బంతి కేసీఆర్‌ కోర్టులోకి వెళుతుంది. ఆయన సానుకూల నిర్ణయమే తీసుకుంటారని రాష్ట్ర ప్రజానీకమంతా ఆశిస్తోంది. మళ్లీ రోడ్లమీద ఆర్టీసీ బస్సులను చూడాలని అందరూ ఉవ్విళ్లూరుతున్నారు.

THEINDUSTRIALDISPUTES_ACT1947_0 (1)

Read more RELATED
Recommended to you

Exit mobile version